Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మూడో స్థానానికి, బీజేపీ రెండో స్థానానికి?

By:  Tupaki Desk   |   15 April 2019 10:10 AM GMT
కాంగ్రెస్ మూడో స్థానానికి, బీజేపీ రెండో స్థానానికి?
X
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక వెలుగు వెలిగింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ ను నిలబెట్టింది. అప్పట్లో తెలంగాణలో బీజేపీ కొద్దో గొప్పో సీట్లను నెగ్గినా.. కాంగ్రెస్ తో పోటీ పడేంత సీన్ బీజేపీకి ఉండేది కాదు. అలా వెలిగిన తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఆ ప్రాంతంలో తనకు తిరుగులేదని కాంగ్రెస్ అనుకుంది. కట్ చేస్తే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన ఐదు సంవత్సరాలకు ఆ పార్టీ పరిస్థితి మరీ ఇలా తయారైపోవడం విశేషం.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో మెట్టు దిగజారిందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి చిత్తు అయ్యింది. అధికారం సంపాదించుకోవడం మాట అటుంచి చిత్తుగా ఓడింది.

ఇక లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత దిగజారడం గ్యారెంటీ అని, మరీ మూడో స్థానానికి పడిపోతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఎలాగూ తెరాస నంబర్ పొజిషన్లో ఉంటుంది. ఇక గెలిచే సీట్ల నంబర్ విషయంలోనూ, పొందే ఓట్ల శాతం విషయంలోనూ రెండో స్థానం బీజేపీదే అనే టాక్ నడుస్తూ ఉందిప్పుడు.

కనీసం ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గట్టి పోటీదారుగా నిలవనుందని అంటున్నారు. వాటిల్లో బీజేపీ నెగ్గవచ్చు లేదా రెండో స్థానంలో నిలవొచ్చు. వాటిల్లో కాంగ్రెస్ ది మూడో స్థానమే! సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీం నగర్, మహూబాబ్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ మంచి పోటీ ఇచ్చిందని సమాచారం. వీటిలో రెండు మూడో గెలిచినా గెలవొచ్చని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మల్కాజ్ గిరి, ఖమ్మం, భువనగిరి, చేవెళ్లలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎలా చూసినా కాంగ్రెస్ కన్నా బీజేపీనే ఎక్కువ ఎంపీ సీట్లను నెగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి అసలు సంగతి ఏమిటనేది మే ఇరవై మూడుకు గానీ తెలియదు!