Begin typing your search above and press return to search.

క‌దిలిన కేంద్రం.. ఏపీ-తెలంగాణ‌ల‌కు మంచి జ‌రుగుతుందా?

By:  Tupaki Desk   |   12 Feb 2022 10:35 AM GMT
క‌దిలిన కేంద్రం.. ఏపీ-తెలంగాణ‌ల‌కు మంచి జ‌రుగుతుందా?
X
తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత విభజన వివాదాలపై కేంద్రం ఎట్టకేలకు దృష్టి సారించింది. సమస్య ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. మొత్తం 9 అంశాలతో కూడిన అజెండాతో సమావేశానికి సిద్ధంకావాలని.. ఇరు రాష్ట్రాలకు సమాచారం పంపింది. ఈ అజెండాలో ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం కూడా చేర్చ‌డం గ‌మ‌నార్హం.

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలుగురాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల పంపకాలపై తలెత్తిన వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన సహా ఇతర అపరిష్కృత అంశాలపై.. ఈనెల 8నే త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం.. ఈనెల 17న మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జరిగే సమావేశానికి.. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్‌కుమార్‌ నేతృత్వం వహించనుండగా.. ఏపీ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌, తెలంగాణ నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొంటారు. సమావేశంలో మొత్తం 9 అంశాలపై చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం.. ఇరు రాష్ట్రాలకు అజెండా ప్రతిని పంపింది. అయితే.. ఈ ఒక్క స‌మావేశంతోనే ఏవీ తేలిపోవ‌ని.. త్వ‌ర‌లోనే మ‌రిన్ని స‌మావేశాలు పెట్టాల‌ని కూడా కేంద్రం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఏదేమైనా.. ఇప్ప‌టి వ‌ర‌కుక‌నీసం ఓర‌కంట కూడా చూడ‌ని.. స‌మ‌స్య‌ల‌పై కేంద్రంలో క‌ద‌లిక రావ‌డం ప‌ట్ల ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో.. ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాలుకూడా భేష‌జాల‌కు పోకుండా.. స‌మ‌స్య‌ల‌ను సాధ్య‌మైనంత వేగంగా.. ప‌రిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని కూడా ప్ర‌జ‌లు సూచిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

అజెండా ఇదే
+ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ విభ‌జ‌న‌
+ ఏపీ, తెలంగాణ‌ల్లో విద్యుత్ వినియోగం
+ ప‌న్నుల విష‌యంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం
+ బ్యాంకు డిపాజిట్లు, ఇత‌ర ఆర్థిక అంశాల విభ‌జ‌న‌
+ వ‌న‌రుల స‌ర్దుబాటు
+ ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌ల్లోని ఏడు క‌రువు ప్ర‌భావిత జిల్లాలకు సాయం
+ ఏపీకి ప్ర‌త్యేక హోదా