Begin typing your search above and press return to search.

ఆర్కే మృతి పై భార్య స్పందన .. చనిపోయాడా?లేదా? ఏది నిజం !

By:  Tupaki Desk   |   15 Oct 2021 7:25 AM GMT
ఆర్కే మృతి పై భార్య స్పందన .. చనిపోయాడా?లేదా? ఏది నిజం !
X
మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కన్ను మూశారు. చత్తీస్‌గడ్‌లోని బస్తర్ అడవుల్లో ఆర్కే కన్నుమూసినట్టు తెలుస్తోంది. దక్షిణ బస్తర్‌లోని మాడ్‌ అటవీ ప్రాంతంలో ఆర్కే మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. మావోయిస్టు నేత ఆర్కే అసలు పేరు అక్కిరాజు హరగోపాల్‌.. ఆయనమావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమృకోట. ఆర్కే విద్యాధికుడు.. ఆయన వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ చదివారు కూడా. ఆర్కే భార్య శిరీష ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో నివాసం ఉంటున్నారు. అలకూరపాడు కి చెందిన విరసం నేత కళ్యాణ్ రావు, ఆర్కే ఇద్దరూ తోడల్లుళ్లు. టంగుటూరు మండలం ఆలకూరపాడు లో నివాసం ఉంటున్న ఆర్కే భార్య శిరీష ఈ వార్తను విశ్వసించడంలేదు. తమకు మాకు నమ్మదగిన సమాచారం వచ్చేంత వరకు స్పందించబోమని విరసం నేత కళ్యాణ్ రావు అన్నారు.

ఒకవేళ ఆర్కే మృతి నిజమైతే పార్ధీవదేహాన్ని తాము అక్కడ నుంచి తెచ్చుకునేలా సహకరించాలని ఆ ప్రభుత్వాన్ని, అక్కడి గ్రామాల ప్రజలకు ఆర్కే భార్య శిరీష విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె టంగుటూరు మండలం, ఆలకూరపాడులో నివాసం ఉంటున్నారు. అయన మృతి పై మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఆయన మరణించారన్న వార్తను ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇక ఆర్కే కు సంబంధించిన విషయాలు పరిశీలిస్తే.. మాచర్లలో ఇంటర్‌ చదివేటప్పుడు ఆర్కే ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆర్కే, నక్సల్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన మావోయిస్టు ఉద్యమంలో తనదైన ముద్ర వేశారు.

దేశవ్యాప్తంగా పలు చోట్ల ఆర్కేపై కేసులు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్కే అనేకసార్లు తప్పించుకున్నారు. ఆర్కే గతంలో మాచర్ల మండలం ఏకోనాంపేట ఎన్‌ కౌంటర్‌ నుంచి తప్పించుకున్నారు. ఆర్కేపై ఏపీ పోలీసులు రూ.50 లక్షల రివార్డు ప్రకటించారు. ఆర్కే కుమారుడు మున్నా కూడా నక్సల్స్‌లోనే చేరారు. ఆయన గతంలో జరిగిన ఓ ఎన్‌ కౌంటర్‌ లో కన్నుమూశారు. ప్రస్తుతం వస్తున్న ఆర్కే మృతి వార్తలను మావోయిస్టు సానుభూతి పరులు విశ్వసించడం లేదు. గతంలోనూ పోలీసులు ఇలాంటి వార్తలు చాలా ప్రచారం చేశారని గుర్తు చేస్తున్నారు.

అయితే ఓ వైపు కుటుంబం , మరోవైపు మావోయిస్ట్ పార్టీ నాయకత్వం మౌనంగా ఉంది. దాంతో, ఆర్కే డెత్‌పై అనేక అనుమానాలు చెలరేగుతున్నాయి. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో మరణించాడని ఛత్తీస్‌ గఢ్‌ పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు తెలిపింది. కానీ, పోలీసుల మాటల్ని తాము నమ్మలేమంటున్నారు ఆర్కే కుటుంబ సభ్యులు, బంధువులు. మావోయిస్ట్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్ముతామంటున్నారు ఆర్కే తోడల్లుడు, విరసం నేత కల్యాణ్‌రావు. ఆర్కే మరణించి ఉంటే మావోయిస్ట్ పార్టీ అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. ఆర్కే డెత్ వార్తల వెనుక ప్రభుత్వం, పోలీసుల కుట్ర ఉండొచ్చని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఆర్కే సోదరుడు, బంధువులదీ ఇదే మాట. ఆర్కే డెత్‌ పై క్లారిటీ రావాలంటే మావోయిస్ట్ పార్టీ ప్రకటన ఒక్కటే ఆధారం అంటున్నారు.