Begin typing your search above and press return to search.

భర్త నుండి రక్షణ కల్పించండి...ప్రియుడితో కలిసి కోర్టులో భార్య పిటిషన్ !

By:  Tupaki Desk   |   18 Jun 2021 4:30 PM GMT
భర్త నుండి రక్షణ కల్పించండి...ప్రియుడితో కలిసి కోర్టులో భార్య పిటిషన్ !
X
ఈ సమాజంలో పెళ్లికి ఓ ప్రత్యేకమైన విలువ ఉంది. మూడుముళ్లు వేసిన తర్వాత ఆ ఇద్దరు దంపతులు కూడా వివాహబంధానికి లోబడి నడుచుకోవాలి. అయితే , ఈ మధ్య రోజుల్లో వివాహబంధాన్ని కూడా కొందరు అపహాస్యం చేస్తున్నారు. కొందరు భర్తలు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని మోసం చేస్తూ మరో మహిళతో సంబంధం పెట్టుకుంటున్నారు. అలాగే భార్యలు కూడా భర్తలకు తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇతరులతో సంబంధం నడుపుతున్నారు. ఈ తరహా చేష్టలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందిలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే ... తాజాగా ఓ మహిళ భర్తను కాదనుకొని , ఇంకో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకొని , భర్త నుండి ఆ కుటుంబం నుండి రక్షణ కల్పించాలంటూ ఏకంగా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ విచారించిన కోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ , ఇది హిందూ వివాహ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఆ మహిళకి ఫైన్ విధించింది.

వివరాల్లోకి వెళ్తే .. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు త‌మ‌పై దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ ఓ వివాహిత, ఆమె ప్రియుడు అలహాబాద్ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ పై మంగళవారం న్యాయమూర్తులు కౌషల్ జయేంద్ర థాకర్, దినేష్ పాథక్ విచారణ చేపట్టారు. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలో భర్తగానీ, ఇతరులుగానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం వారికి రూ.5000 ఫైన్ వేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కానీ అది చట్టానికి లోబ‌డి ఉండాలని , సమాజంలో చట్టవ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్‌ను ఎలా అంగీకరించగలమని ప్రశ్నించింది. ఇది హిందూ వివాహ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ,మహిళకు రక్షణ కల్పించడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. భర్త నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే, ముందుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని , కానీ అలా జరగలేదని తెలిపింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో వివాహేతర సహజీవనానికి అనుమతించలేమని కోర్టు స్పష్టం చేసింది.