ప్రియుడితో కలిసి భర్త హత్య.. పట్టించిన కూతురు

Thu Aug 09 2018 13:06:21 GMT+0530 (IST)

  మానవత్వం మంటగలుస్తోంది. మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో ప్రాణాలు పోతున్నాయి. ప్రియుడిపై మోజుతో భర్తను చంపిన ఇల్లాలు కథ రోజుకో మలుపులు తిరుగుతోంది.ఇటీవల జూబ్లీహిల్స్ లోని ఫిలింనగర్ లో భర్త బానోతు జగన్ నాయక్ నోట్లో బొద్దింకల మందు హిట్ కొట్టి చంపానని భార్య దేవిక పోలీసుల ముందు ఒప్పుకొని లొంగిపోయింది. భర్త చిత్రహింసలకు భరించలేకే ఈ పని చేశానంది.కానీ పోలీసుల విచారణలో తాజాగా నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. దేవిక  ప్రియుడితో కలిసే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేటతెల్లమైంది..

దేవిక రెండేళ్ల క్రితం ఫిలింనగర్ లోని అడ్వాన్స్ బీపీఓ సంస్తలో హౌజ్ కీపింగ్ విభాగంలో చేరింది. ఆమెకు కృష్ణా జిల్లా నాగయలంక మండలం సమీపంలోని బర్రాంకుల గ్రామానికి చెందిన తోట బెనర్జీ(35)తో పరిచయం ఏర్పడింది. ఇది పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. దేవిక భర్త జగన్ లేనప్పుడు ప్రియుడు బెనర్జీ గుట్టుగా వీరి ఇంటికి వచ్చి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసి భర్త జగన్ .. దేవికను హెచ్చరించాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవలయ్యాయి.. దేవిక ఆఫీసుకెళ్లి  బెనర్జీని బెదిరించి ఆమె ఉద్యోగం మాన్పించేశాడు. అనంతరం రెండు నెలల క్రితమే జ్ఞాని జైల్ సింగ్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లోని మూడో అంతస్తులోకి జగన్ కొత్తగా అద్దెకు దిగారు. మకాం మార్చడంతో దేవిక కూడా తన ప్రియుడు బెనర్జీకి అడ్రస్ చెప్పి వారు ఉంటున్న అపార్ట్ మెంట్ లోని పెంట్ హౌస్ లో దిగేలా చేసింది. అనంతరం భర్తను చంపాలని ప్లాన్ చేసింది.

పైన పెంట్ హౌస్ లోనే ఉండడంతో దేవిక-బెనర్జీ రోమాన్స్ ఎక్కువైపోయింది. ఓ రోజు చూసిన భర్త జగన్ దీనిపై పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఫుల్లుగా తాగి వచ్చి గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి భర్త పడుకున్నాక మీద పెంట్ హౌస్ లో ఉన్న ప్రియుడు బెనర్జీని పిలిచి భర్తను చంపేసింది.  బెనర్జీ ఎలక్టిక్ రైస్ కుక్కర్ ను జగన్ తలపై ఉంచి ఊపిరాడకుండా చేశాడు.. మధ్యలో భార్య దేవిక హిట్ ను భర్త నోట్లో కొట్టింది. అనంతరం భర్త వృషణాలను మెలితిప్పింది. దీంతో జగన్ చనిపోయాడు. వీరి గొడవకు మెలకువ వచ్చిన దేవిక పిల్లలు - ఇంటి ఓనర్ లేచారు. దీంతో ప్రియుడు బెనర్జీ పారిపోయాడు. బెనర్జీని చూసిన పిల్లలు - ఇంటి ఓనర్ లు పోలీసుల విచారణలో నిజాలు చెప్పారు. నాన్నను చంపిన విషయం చెప్పొద్దని పిల్లలకు తల్లి నూరిపోసింది. కానీ ఆ పసిపిల్లలు ఇదే విషయాన్ని పోలీసుల ఎదుట చెప్పడంతో దేవిక దొరికిపోయింది.  దేవికతోపాటు ఆమె ప్రియుడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పంపారు. ఇలా వివాహేతర సంబంధంతో సొంత భర్తనే చంపించింది ఈ కసాయి మహిళ..