Begin typing your search above and press return to search.

కామెంటేట‌ర్‌గా న‌న్నెందుకు తొల‌గించారంటే - మంజ్రేక‌ర్‌

By:  Tupaki Desk   |   1 Aug 2020 5:33 PM GMT
కామెంటేట‌ర్‌గా న‌న్నెందుకు తొల‌గించారంటే - మంజ్రేక‌ర్‌
X
భార‌త క్రికెట్ వ్యాఖ్యాత‌ల్లో సంజ‌య్ మంజ్రేక‌ర్ స్థానం ప్ర‌త్యేకం. ఆయ‌న వ్యాఖ్యానానికి అభిమానులు పెద్ద సంఖ్య‌లోనే ఉన్నారు. త‌న‌దైన శైలిలో విశ్లేష‌ణ‌, వ్యాఖ్యానం చేయ‌గ‌ల స‌మ‌ర్థుడ‌త‌ను. అదే స‌మ‌యంలో ముంబ‌యి ఆట‌గాళ్ల ప‌ట్ల అతి ప్రేమ చూపిస్తూ వేరే ఆట‌గాళ్ల‌ను కించ‌ప‌రుస్తాడ‌నే విమ‌ర్శ‌లున్నాయి. గ‌త ఏడాది ఇవే ఆరోప‌ణ‌ల‌తో బీసీసీఐ వ్యాఖ్యాత‌ల ప్యానెల్లో చోటు కోల్పోయాడు. 2019 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా జ‌డేజాను విమ‌ర్శించ‌డంతో కొంద‌రు ఆట‌గాళ్లు బీసీసీఐకి ఫిర్యాదు చేయ‌డం వల్లే మంజ్రేక‌ర్‌పై వేటు ప‌డింద‌నుకుంటున్నారు.

కాగా త‌న‌ను తిరిగి వ్యాఖ్యాతగా తీసుకోవాలని బీసీసీఐని మంజ్రేక‌ర్ తాజాగా అభ్యర్థించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌న‌పై ఎందుకు వేటు ప‌డింద‌నే విష‌య‌మై మీడియాతో మాట్లాడాడు మంజ్రేక‌ర్.కొంద‌రు ఆట‌గాళ్ల‌కు తాను న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే త‌న‌ను త‌ప్పించారంటూ ఓ బీసీసీఐ అధికారి ఫోన్ చేసి చెప్పిన‌ట్లు సంజ‌య్ వెల్ల‌డించాడు. ఈ ఏడాది మార్చిలో త‌న‌పై వేటు ప‌డింద‌ని తెలిసి షాకైన‌ట్లు అత‌ను చెప్పాడు. కాగా యూఏఈలో త్వ‌ర‌లోనే ఐపీఎల్ జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో అందులో వ్యాఖ్యానం చేసేందుకు అనుమతించాలని కోరుతూ బోర్డుకు సంజ‌య్‌ ఈ–మెయిల్‌ పంపాడు. గతంలో బోర్డు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడంలో పొరపాటు జరిగిందని.. ఇప్పుడు పూర్తి అవగాహన వచ్చింద‌ని.. వాటి ప్ర‌కార‌మే నడుచుకుంటానని మంజ్రేకర్ ఈమెయిల్లో పేర్కొన్నాడు.