Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో సరికొత్త రాజకీయం చేస్తున్న కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   16 Jun 2020 10:10 AM GMT
కాంగ్రెస్ లో సరికొత్త రాజకీయం చేస్తున్న కోమటిరెడ్డి
X
కాంగ్రెస్ సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో సడన్ మార్పుకు కారణమేంటి? నియోజకవర్గం వదిలి తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. విమర్శించినోళ్లను ప్రశంసిస్తున్నారు. ఎప్పుడూ కలవని వారిని కలుస్తూ కాంగ్రెస్ లో సరికొత్త రాజకీయం చేస్తున్నారు. దీంతో మారిన కోమటిరెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పెద్దలు కూడా నజర్ పెట్టారు.

ఇన్నాళ్లు తనను గెలిపించిన నల్గొండ పాత జిల్లా సమస్యలనే ప్రస్తావించిన కోమటిరెడ్డి ఇప్పుడు తెలంగాణ సమస్యలపై పడి ప్రశ్నిస్తున్నారు. సడన్ గా పొలిటికల్ స్టైల్ మార్చుకున్నారు.

తాజాగా కోమటిరెడ్డి ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణ వెనుబాటుకు గురవుతుందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని గళమెత్తుతున్నాడు. ప్రాజెక్టుల వద్ద దీక్ష, సందర్శనలు అంటూ హడావుడి చేస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తోనే కలిసి కోమటిరెడ్డి పర్యటిస్తున్నారు. ఉత్తమ్ పదవీకాలం అయిపోవడంతో ఆయన స్థానంలోకి రావాలనే కోమటిరెడ్డి ఇలా రాజకీయం చేస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉత్తమ్ ను చాలా సార్లు కోమటిరెడ్డి విమర్శించాడు. మొన్నటిదాకా ఉప్పునిప్పులా వీరిద్దరూ ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ మద్దతు కోసం వెంటపడుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఎన్నో ఏళ్ల నుంచి పీసీసీ చీఫ్ కావాలని కోమటిరెడ్డి ఆశిస్తున్నారు. తెలంగాణ సీఎం పోస్టుకు దగ్గరి దారి పీసీసీ చీఫే. అందుకే పీసీసీ పదవి టార్గెట్ గానే కోమటిరెడ్డి చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.

పీసీసీ రేసులో ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లే వినిపిస్తున్నాయి. అందుకే అందర్నీ కలుపుకొని పీసీసీ చీఫ్ పదవి చేపట్టేందుకే కోమటిరెడ్డి తను తిట్టిన నేతలను అందరినీ మచ్చిక చేసుకుంటున్నాడని.. టీఆర్ఎస్ పై ధాటిగా విమర్శలు చేస్తున్నాని పార్టీలో చర్చ జరుగుతోంది.