Begin typing your search above and press return to search.

టీడీపీ డబల్ గేమ్ ఎందుకు ఆడుతోంది ?

By:  Tupaki Desk   |   20 Oct 2020 8:00 AM GMT
టీడీపీ డబల్ గేమ్ ఎందుకు ఆడుతోంది ?
X
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తే ఉద్యమం చేస్తాం...ఇది తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన ప్రకటన. నిజంగా తెలుగుదేశంపార్టీ తరపున రావాల్సిన ప్రకటన కాదు. ఎందుకంటే విద్యుత్ రంగంలో సంస్కరణలను తీసుకొచ్చిందే తాను అని చంద్రబాబునాయుడు పదే పదే చెప్పుకుంటున్నారు. మరి వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించటాన్ని టీడీపీ ఇపుడు ఎలా తప్పుపడుతోంది ? నిజానికి వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కు మీటర్లను బిగించటాన్ని చంద్రబాబునాయుడు స్వాగతించాలి. ఎందుకంటే సంస్కరణలకు ఆధ్యుడని తనకు తానే చెప్పుకునే వ్యక్తి మీటర్లను ఎలా వ్యతిరేకిస్తున్నట్లు ?

నిజానికి రాష్ట్రంలో అధికారిక లెక్కల ప్రకారమే 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. అయితే వీటిల్లో దేనికీ మీటర్లు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. దాని వల్ల ఎవరెంత విద్యుత్ వాడుతున్నారనే విషయంలో కచ్చితమైన లెక్కలు లేవు. ఈ లెక్కల కోసమే ప్రభుత్వం మీటర్లను బిగించాలని అనుకుంటోంది. మీటర్లు బిగించినా వచ్చే విద్యుత్ బిల్లులను తామే రైతుల తరపున చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా టీడీప పట్టించుకోవటం లేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగించాలన్న నిబంధనను తెచ్చింది కేంద్రప్రభుత్వం. నూతన వ్యవసాయ సంస్కరణల చట్టంలో వ్యవసాయ విద్యుత్ కు మీటర్లు బిగించటం కీలకం. కేంద్రం చట్టం చేయటంతో పాటు రైతులు వాడుతున్న విద్యుత్ కు లెక్కలుండాలన్న ఆలోచనలతో రాష్ట్రం కూడా మీటర్ల బిగుంపు విషయాన్ని సీరియస్ గానే తీసుకుంది.

ఇక్కడే టీడీపీ డబల్ గేమ్ బయటపడుతోంది. ఎలాగంటే కేంద్రం తెచ్చిన వ్యవసాయ సంస్కరణల బిల్లుకు పార్లమెంటులో టీడీపీ మద్దతిచ్చింది. ఉభయసభల్లో జరిగిన ఓటింగులో బిల్లుకు అనుకూలంగా ఓట్లేసింది. పార్లమెంటులో ఓట్లేసి రాష్ట్రలో వ్యతిరేకించటం ఏమిటో అర్ధం కావటం లేదు. నిజంగానే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించటాన్ని వ్యతిరేకించేట్లయితే కేంద్రం తెచ్చిన బిల్లును కూడా వ్యతిరేకించాల్సింది. అప్పుడు టీడీపీ డిమాండ్ లో చిత్తశుద్ది ఉందని అనుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అలా చేయని కారణంగా ఇపుడు టీడీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విషయమై ఆరోపణలు పెరిగిపోతోంది.