Begin typing your search above and press return to search.

కొత్త పార్టీలో ఆమె గురించే అతి పెద్ద చర్చ...?

By:  Tupaki Desk   |   6 Oct 2022 10:30 AM GMT
కొత్త పార్టీలో ఆమె గురించే అతి పెద్ద చర్చ...?
X
ఆమె గులాబీ బాస్ ముద్దుల తనయ. తండ్రికి తగ్గ కుమార్తెగా రాజకీయ లక్షణాలను పుణికి పుచ్చుకుని ధీటుగా ఎదిగారు. ఎంపీగా వెలిగారు. ఇపుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. టీయారెస్ పార్టీలో మహిళా నేతగా అత్యంత కీలకంగా ఉన్న కవిత ఆ టీయారెస్ కాస్తా బీయారెస్ గా మారి జాతీయ స్థాయికి ఉవ్వెత్తున ఎగబాకుతున్న వేళ ఎక్కడా కనిపించకపోవడం మాత్రం అందరికీ షాకింగ్ లాగానే అనిపించింది.

కేసీయార్ చిరకాల కోరిక జాతీయ రాజకీయ రంగ ప్రవేశం. దానికి ఆయన తన సొంత పార్టీనే వేదికగా చేసుకుంటున్నారు. మరి ఇంతటి అతి ముఖ్యమైన వేళ, నిజంగా చెప్పాలీ అంటే పండుగ వేళ ఏకైక కుమార్తె, పాటీలో కీలక నాయకురాలిగా ఉన్న కవిత గైర్ హాజర్ కావడం మీద మీడియా ఫోకస్ పెట్టేసింది.

నిజంగా చూస్తే పార్టీ ప్రకటనకు ఎంత ప్రాముఖ్యత మీడియా ఇచ్చిందో తెలియదు కానీ కవిత మిస్ అయ్యారు అన్న దాన్ని పట్టుకుని మాత్రం చిలవలు పలవలు చేసి పారేసింది. ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారని, ఆమె రాజకీయాల పట్ల అనసక్తిని పెంచుకుంటున్నారని ఇలా చాలానే మీడియాలో ముచ్చట్లు పెట్టారు.

ఇంతకీ కవిత ఎందుకు హాజరు కాలేదు అన్నది మాత్రం ఎవరూ చెప్పడంలేదు. ఆమె బతుకమ్మ వేడుకల్లో బాగానే పాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ అయిన తర్వాత కవిత పూర్తిగా పార్టీ వ్యవహారాలపైన ఆసక్తి చూపుతున్నారు. మరి అదే పార్టీ మరో రూపాన్ని సంతరించుకునే కార్యక్రమం ఆమెకు ముఖ్యం అని అనిపించలేదా అన్న చర్చ సొంత పార్టీలో కూడా సాగుతోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే మొదటి నుంచి టీయారెస్ లో కుటుంబ ఆధిపత్యం ఉంది అన్నది అంతా అంగీకరిస్తారు. అయితే ఆ ఫ్యామిలీలో కూడా ఇపుడు విభేదాలు పొడసూపుతున్నాయని అంటున్నారు. అందువల్లనే కవిత గైర్ హాజరు అయ్యారా అన్న చర్చ వైపు కూడా ఈ వ్యవహారం మళ్ళుతోంది. ఆ పార్టీకి చెందిన వారు, ఎంపీ అయిన సంతోష్ కుమార్ వ్యవహారం కూడా ఈ మధ్య చర్చకు వస్తోంది. ఆయన సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని కూడా ప్రచారం అయితే సాగింది.

ఇవన్నీ పక్కన పెడితే కేసీయార్ జాతీయ పార్టీ పెట్టడం వెనక కూడా కుటుంబ వ్యవహారాలు ఆధిపత్య పోరు కారణం అని మరో చర్చ ముందుకు వస్తోంది. తమ కుమారుడు కేటీయార్ కి ముఖ్యమంత్రి పదవి అప్పగించడానికి ఆయన లైన్ క్లియర్ చేస్తూ మిగిలిన వారిని జాతీయ పార్టీ పేరిట రెండవ వైపుగా నడిపించడానికి చూస్తున్నారు అని అంటున్నారు.

అయితే గాలిలో దీపం లాంటి జాతీయ రాజకీయం పట్ల నమ్మకం లేని వారు అక్కడే ఉన్నారని, వారికి తెలంగాణా రాజకీయమే ముఖ్యమని అంటున్నారు. మరి ఆ విధంగా చూస్తే కవితకు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదా లేక తాను తెలంగాణాలోనే ఉండాలని అనుకుంటున్నారా అన్నది కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి ఫ్యామిలీ పార్టీకి ప్రాబ్లమ్స్ ముందు అక్కడ నుంచే వస్తాయి. వాటిని సరిదిద్దుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఏపీలో ఎన్టీయార్ ఫ్యామిలీ విభేదాలు ఎపిసోడ్ కళ్ళ ముందు ఉన్న ముచ్చటే కదా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.