Begin typing your search above and press return to search.

యాదాద్రికి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు?

By:  Tupaki Desk   |   15 Jun 2021 9:30 AM GMT
యాదాద్రికి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు?
X
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఈ రోజు యాదాద్రికి వెళ్లారు. వారికి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి.. జగదీశ్ రెడ్డిలు ఘన స్వాగతం పలికి ఆలయంలోకి వెంట పెట్టుకొని వెళ్లారు. సంప్రదాయంలో భాగంగా ఆలయ ఆర్చకులు సీజేఐ దంపతులకు పూర్ణకుంభంతో ఆలయంలోకి స్వాగతం పలికారు.

స్వామి వారి దర్శనం తర్వాత బాలాయంలో రమణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు వారికి వేదశీర్వచనం పలికారు. స్వామి వారి దర్శనం పూర్తి అయ్యాక ఆలయ నిర్మాణలను సీజేఐ దంపతులు పరిశీలించారు. ఆలయంలో చేసిన మార్పుల గురించి అధికారులు వారికి వివరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రాష్ట్రానికి వచ్చిన చీఫ్ జస్టిస్ ను కలిసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. యాదాద్రికి రావాలని కోరటం తెలిసిందే.

యాదాద్రికి తాను తీసుకెళతానని సీఎం కేసీఆర్ చెప్పటం.. సుప్రీం చీఫ్ జస్టిస్.. గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కాంబినేషన్ లో యాదాద్రి టూర్ ప్లాన్ చేశారు. తాజాగా చూస్తే.. సీజేఐ దంపతులు మాత్రమే యాదాద్రిని దర్శించుకోవటం గమనార్హం. మరి.. వారి వెంట వస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెళ్లనట్లు? సీజేఐ అంత పెద్ద మనిషికి మాట ఇచ్చిన తర్వాత వెంట వెళ్లపోవటం ఏమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం..సీజేఐను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట పెట్టుకొని తీసుకెళ్లటం ప్రోటోకాల్ సమస్యలతోపాటు.. ఇలాంటి ఏ ముఖ్యమంత్రి చేయరన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్ కు.. పాలనలో అత్యున్నత స్థానంలో ఉన్న వారికి మధ్య సున్నితమైన విభజన రేఖ ఉంటుందని గుర్తు చేస్తున్నారు. తమ రాష్ట్రంలో తన పాలనలో డెవలప్ చేసిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని చూపించాలన్న ఉత్సాహంతోనే కేసీఆర్ వెంట వస్తానని చెప్పి ఉంటారని చెప్పాలి.

అయితే..తాను చెప్పిన మాటను ఆచరణలోకి తీసుకెళ్లేటప్పుడు వచ్చే సాంకేతిక అంశాల్ని పరిగణలోకి తీసుకోవటంతో పాటు.. కొందరు ప్రముఖులు చేసిన సూచనతో ఆయన వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. దీనికితోడు ఇప్పుడున్నరాజకీయ వాతావరణంలో అవసరమైన దూరాన్ని మొయింటైన్ చేయటం చాలా తప్పనిసరి అని.. ఆ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ సీజేఐ వెంట యాదాద్రికి వెళ్లలేదన్న మాట వినిపిస్తోంది.