Begin typing your search above and press return to search.

టీడీపీకి అంత తొందర ఎందుకు?

By:  Tupaki Desk   |   19 Oct 2020 2:10 PM GMT
టీడీపీకి అంత తొందర ఎందుకు?
X
పువ్వు పుట్టకముందే పరిమళించాలన్న చందంగా టీడీపీ బ్యాచ్ తయారైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అరే..! జగన్ బీసీ కార్పొరేషన్లను ఇలా ఏర్పాటు చేయగానే వాటి ఫలితాలు.. పర్యవసనాలు రాకముందే టీడీపీ, దాని అనుకూల చానెల్స్ నెగెటివ్ ప్రచారం చేయడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. టీడీపీ చానెల్స్ తీరుపై ప్రజల్లోనూ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఓ మంచి ప్రయత్నానికి సీఎం జగన్ ముందడుగు వేస్తే దాని ఫలితం రాకుండానే మొగ్గలోనే తుంచివేసేలా టీడీపీ చానెల్స్ కుట్ర పన్నుతున్నాయని కొందరు మేధావులు సైతం ఆరోపిస్తున్నారు. జగన్ విధానం మొదలు కాకముందే ఇన్ని కుట్రలా అని ప్రశ్నిస్తున్నారు. దాని ఫలితం చూశాక ఎన్ని చర్చలు పెట్టినా.. ఎలుగెత్తి చాటినా అర్థం ఉంటుందని.. ఇప్పుడే ఆ తొందర ఎందుకని నిలదీస్తున్నారు.

ఏపీలోని ప్రతిపక్ష టీడీపీకి చేతిలో చానెల్స్, టాప్ పత్రికలు ఉన్నాయని వాళ్ల ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టి చర్చ చేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం కొత్త విధానంతో ప్రయాణం చేస్తుంటే వాటిపై పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండానే టీడీపీ అనుకూల చానెల్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇటీవలే సీఎం జగన్ బీసీల్లో ఉన్న అన్ని ఉప కులాలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చి వారిని చైర్మన్, డైరెక్టర్లుగా నామినేట్ చేశాడు. వాళ్ల కులాలకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. దాన్ని ఫలితాలు రాకుండానే టీడీపీ అనుబంధ చానెల్స్ లో చర్చ పెట్టి నిధులు, విధులు లేవు అని ఆరోపణలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముందు కార్పొరేషన్స్ పెడితేనే కదా దాని అమలు, ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలిసేది.. అవి పెట్టకముందే టీడీపీ చానెల్స్ చేస్తున్న రచ్చ ఏంటని విమర్శిస్తున్నారు.

ఇదంతా బీసీల కార్పొరేషన్ లను, వాటిపై కొలువుదీరే బీసీ నేతలను మానసికంగా దెబ్బ తీయాలని టీడీపీ చానెల్స్ చేస్తున్న కుట్ర అని నేతలు ఆడిపోసుకుంటున్నారు.. ఏపీ సీఎం జగన్ ఒక కొత్త విధానంతో ముందుకు వెళుతున్నాడని మేధావులు అంటున్నారు. కానీ దీనికి కొంచెం టైం ఇస్తే ఈ విధానాలు సక్సెస్ అవుతాయో లేదో తెలుస్తుంది. కానీ ఇవ్వకుండానే మొదట్లోనే టీడీపీ చానెల్స్ నెగెటివ్ ప్రచారం చేయడాన్ని మేధావులు తప్పుపడుతున్నారు.

ఈ బీసీ కార్పొరేషన్లపై జీవో వచ్చిన వెంటనే టీడీపీ అనుబంధ చానెల్స్, పేపర్లలో డిబేట్లు పెట్టి అడ్డుకోవాలని చూస్తున్నాయని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఆ కార్పొరేషన్స్ వలన ఏమీ జరగకపోతే అప్పుడు డిబేట్లు పెడితే ఏమైనా అర్తం ఉంటుందని.. అంతేకానీ చానెల్స్ ఉన్నాయని.. సబ్జెక్ట్ లేని వారిని కూర్చుండబెట్టి ఆ టాపిక్స్ మీద చర్చ పెట్టి ఏదో మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.