Begin typing your search above and press return to search.

ఏపీలో కేసీఆర్ అంత మొనగాడు లేడా?

By:  Tupaki Desk   |   17 Jun 2020 10:10 AM GMT
ఏపీలో కేసీఆర్ అంత మొనగాడు లేడా?
X
అలిగేషన్స్ ఉంటేనే రాజకీయాల్లో చిక్కుతాం.. అవేం లేకపోతే కేసీఆర్ లాగా చెలరేగిపోతుంటాం.. రాజకీయాల్లో నేతలు చేసిన పొరపాట్లే వారి జుట్టును పైనున్న వారికి అందిస్తాయి.. ఇప్పుడు ఏపీలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

నిజానికి ఏపీలో అసలు బీజేపీ ఉనికే లేదు. ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. వైసీపీ ఎంపీ ఒకాయన బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతూ వైసీపీనే ఎదురిస్తున్నారు. చాలా మంది టీడీపీలో ఉంటే బతికిబట్టకట్టలేం అని బీజేపీలో చేరుతున్నారు. వైసీపీ లోకి వెళ్లలేని వారికందరికీ బీజేపీ అస్త్రంలా మారింది.

ఇక సీఎం జగన్ ఎంత బాగా పనిచేస్తున్నా.. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.. కేంద్రంతో సఖ్యతతోనే పనులు చేసుకుంటున్నారు. నిధులు రాబడుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలను పక్కన పెడితే కేంద్రంలోని మోడీ, అమిత్ షాలకు మద్దతుగా రాజకీయం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ బీజేపీ పక్షాన నిలబెడుతున్నారు.

ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు మోడీకి ఎప్పుడో బెండ్ అయిపోయాడన్న అపవాదు ఉంది. ఎన్నికల్లో ఓడిపోగానే కాళ్ల బేరానికి రెడీ అయిపోయాడని రాజకీయాల్లో ఆరోపణలున్నాయి. ఇక రాజధాని లేని అప్పుల్లో ఉన్న రాష్ట్రం కోసం సీఎం జగన్ కూడా కేంద్రంతో సఖ్యతతోనే ఉంటున్నారు. ఇలా బీజేపీ చిత్రంగా ఏపీలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలవకున్నా కూడా ఏపీలో ఆట ఆడించేస్తోంది. జనసేన కూడా అందుకే బీజేపీ పంచన చేరడం విశేషం.

ప్రస్తుతం ఏపీలో టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వం లోని అవినీతిని వెలికి తీస్తూ అరెస్ట్ లు చేస్తోంది. సీబీఐకి అప్పగిస్తూ చంద్రబాబు జుట్టును మోడీ చేతికి ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్షం లేకుండా పోతే.. అధికార వైసీపీని టార్గెట్ చేసి ఏపీలో బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. దీంతో ఏపీలో రెండు పక్షాల లొల్లి కాస్తా బీజేపీకి వరంగా మారుతోందని అంటున్నారు.

అదే తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచినా కేసీఆర్ ను టచ్ చేసే సాహసం చేయడం లేదు. కేసీఆర్ లాంటి అపర రాజకీయ చాణక్యుడి దెబ్బకు ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరవడానికే ఆపసోపాలు పడుతోంది. రాజకీయంగా నిలబడడానికి పోరాడుతోంది. కేసీఆర్ కు సంబంధించిన ఏ లూప్ హోల్ కూడా కేంద్రానికి చిక్కకపోవడం.. రాజకీయంగా బలంగా కేసీఆర్ నిలబడడంతోనే తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేసుల భయంతో చంద్రబాబు, అప్పుల రాష్ట్రాన్ని నడిపించేందుకు జగన్ మోడీ ముందర వంగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఏపీలో కేసీఆర్ లా ఎదురించే మొనగాడు ఎవరూ లేరని చెబుతున్నారు.