కేసీఆర్ మౌనం.. దేనికి సంకేతం!

Mon Nov 29 2021 06:00:01 GMT+0530 (IST)

Why KCR Maintaining Silence

కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఊసూరుమంటూ తిరిగొచ్చారు. ఢిల్లీ పెద్దలతో తాడోపేడో తేల్చుకుంటానని మందీ మార్భలంతో ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లారు. ఏకంగా మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మాకాం వేశారు. అయితే కేసీఆర్‌కు.. మోదీ అమిత్ షా ముఖం చాటేశారు. చివరికి పియూస్ గోయల్‌ను కలిసి ఎలాంటి హామీలు లేకుండా వట్టి చేతులతో వెనుదిరిగారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి వచ్చాక.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేంద్రాన్ని టార్గెట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అందరి ఊహగానాలకు భిన్నంగా ఎందుకో ఆయన మౌనంగా ఉండిపోయారు. ఢిల్లీ పర్యటన వివరాలు కానీ... తదుపరి కార్యాచరణకు సంబంధించిన వివరాలు గానీ ప్రకటించలేదు. ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వరి కొనుగోలుపై కేంద్రం తెగేసి చెప్పడంతో మంత్రులు మాట్లాడటానికి ఎందుకు జంకుతున్నారు? తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన కేసీఆర్.. సైలెంట్‌గా ఉండడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కేసీఆర్‌కు ప్రాధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? లేకపోతే కేసీఆరే అపాయింట్‌మెంట్ కోరలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. అసలు ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా కేసీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లారు? పీయూష్ గోయల్‌ను కలిసేందుకు అవకాశమిచ్చినా... మంత్రులను మాత్రమే పంపి.. ఆయన నిమిత్తమాత్రుడిగా ఎందుకు ఉండిపోయారు. కేటీఆర్‌ను పంపడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటనే అనుమానాలు కూడా వస్తున్నాయి. పీయూష్ గోయల్ ఎదుట పరువు పోతుందనే ఉద్దేశంతోనే కేసీఆర్.. భేటీ కాలేదనే చర్చ సాగుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో మోదీ అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకదని తెలిసినా.. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఢిల్లీ పర్యటనపై తెలంగాణ మంత్రులు గట్టిగానే సమర్థిస్తున్నట్లు సమాచారం. అన్నీ తెలిసే కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఢిల్లీ పరిణామాలను వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.

వాస్తవానికి వరి వివాదం అంత జటిలమైందని కాదనే వాదన కూడా ఉంది. ఈ సమస్య ఒక్క తెలంగాణకే పరిమితం కాదని చెబుతున్నారు. రాజకీయాలు చేయకుండా అధికారులు మంత్రుల స్థాయిలో పరిష్కరించుకోవచ్చని పలువురు చెబుతున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి దళితబంధు అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. కేసీఆర్ కేంద్రంపై యుధ్ధాన్ని ప్రకటించారనే వాదన కూడా నడుస్తోంది. మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడానికి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయని చెబుతున్నారు. స్థాయి మరిచి కేంద్రంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్లే.. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. మమతా బెనర్జీకి అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోదీ.. కేసీఆర్‌కు ఇవ్వకపోడమే ఇందుకు నిదర్శనమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హుజూరాబాద్ ఓటమి తర్వాత కూడా కేసీఆర్ నాలుగైదు రోజులు మౌనంగా ఉండి.. ఆ తర్వాతే తెరపైకి వచ్చారని ఇప్పుడు కూడా అలాంటి ఎత్తుగడ ఏదో ఉందని గుసగుసలు మొదలవుతున్నాయి. ఢిల్లీ నుంచి కేసీఆర్ ఒట్టి చేతులతో తిరిగి రావడంపై బీజేపీ రాష్ట్ర నేతల నుంచి అవమానాలు ఎదురుకావచ్చని అంటున్నారు. కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తామని ఢిల్లీ వెళ్లి.. ఉత్తి చేతులతో తిరుగు ప్రయాణమైన కేసీఆర్ రైతులకు ఏం సమాధానం చెబుతారని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఒత్తిడిలో ఉన్నారని చెబుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాల నుండి తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడం కోసమే కేసీఆర్ కొత్త డ్రామాను తెర మీదకు తీసుకొచ్చారని పలువురు విమర్శిస్తున్నారు.