కరోనా బాధితుల్లో 62శాతం వారే.!

Sun Jul 05 2020 07:00:03 GMT+0530 (IST)

Why Corona Targets Youth

కరోనా వస్తే కాటికిపోవడమే అన్న భయం నుంచి ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు. అయితే ఇప్పటికీ దీనికి సరైన చికిత్స వైద్య సదుపాయాలు లేకపోవడమే మైనస్. సరైన మందులు లేవు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం.. వైరస్ ను అరికట్టడం తప్పితే వేరే మందే లేదు.కరోనాతో వృద్ధులకు చాలా డేంజర్. దీర్ఘకాలిక రోగాలున్న వారికి మరింత ప్రమాదం. అయితే యువతను ఏమీ చేయలేదని.. రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటే ప్రమాదం ఏమీ లేదనుకోవడం శుద్ధ తప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ గాంధీలో చనిపోయిన జర్నలిస్ట్ మనోజ్ వయసు కేవలం 33ఏళ్లు అని మాత్రమే అని గుర్తు చేస్తున్నారు. కరోనా ముదరడానికి మనం తీసుకునే జాగ్రత్తలే ప్రామాణికం అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో యువతీ యువకులే 62.52శాతం ఉండడం గమనార్హం. ఏపీలో కరోనా యువతనే కబళిస్తోందనడానికి ఈ గణంకాలే నిదర్శనం.

ఏపీ వ్యాప్తంగా శుక్రవారం నాటికి 16097 కేసులు నమోదయ్యాయి. అందులో 16-45 ఏళ్ల వారే 10064 మంది (62.52శాతం).. ఇక 46-60 ఏళ్ల వారు 20.34శాతం (3274 మంది).. 60 ఏళ్లు పైబడిన వారు వృద్ధులు 9.96శాతం (1603 మంది) ఉన్నారు. ఇక 15 ఏళ్లలోపు పిల్లలు 7.18శాతం (1156 మంది) ఉన్నారు.

దీన్ని బట్టి కరోనా ముప్పునకు గురవుతున్న వారిలో అత్యధికులు యువకులే కావడం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. కరోనా వృద్ధులకు డేంజర్ అనగానే వారంతా జాగ్రత్త పడ్డారు. యువకులకు ఏం కాదు అనగానే వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే కరోనా వారికే ఎక్కువగా సోకుతోందని తేలింది.అయితే యువతరంలో రికవరీ రేటు ఎక్కువగా ఉండడం ఊరటగా చెప్పవచ్చు.. అయితే ఆస్తమా.. శ్వాసకోశ సంబంధ సమస్యలున్నవారు.. దీర్ఘకాలిక రోగులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.