Begin typing your search above and press return to search.

ధావన్ కి షాక్ తప్పదా ..రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేదెవరు

By:  Tupaki Desk   |   26 July 2021 11:30 PM GMT
ధావన్ కి షాక్ తప్పదా ..రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసేదెవరు
X
ఏడాది భారత్‌ ఆతిథ్యమివ్వాల్సిన టీ20 ప్రపంచకప్‌ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఒమ‌న్ దేశాల‌కు తరలివెళ్లింది. అక్టోబ‌ర్ 17వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు ప్రపంచకప్‌ ను నిర్వ‌హించ‌నున్నారు. మెగా టోర్నీ నిర్వహణ వేదిక, తేదీని అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ఇప్పటికే స్పష్టం చేసింది. భారత్‌ లో క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సం సృష్టించిన నేప‌థ్యంలో టోర్నీ నిర్వహణ వేదిక‌ల‌ను మార్చాల్సి వ‌చ్చింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ప్రపంచకప్‌ మొత్తం జ‌రుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ మ్యాచ్‌ లు మొత్తం నాలుగు వేదిక‌ల్లో జరగనున్నాయి.

యూఏఈ, ఒమ‌న్ దేశాలు మ్యాచ్‌ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ద షేక్ జాయెద్‌ స్టేడియం (అబుదాబి), షార్జా స్టేడియం, ఒమ‌న్ క్రికెట్ అకాడ‌మీ గ్రౌండ్‌లో మెగా టోర్నీ మ్యాచ్‌ ల‌ను నిర్వహించ‌నున్నారు. టోర్న‌మెంట్ తొలి రౌండ్‌ లో అర్హ‌త సాధించిన 8 జ‌ట్లు.. రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌ లు ఆడుతాయి. ఈ జ‌ట్ల నుంచి నాలుగు టీమ్‌ లు.. సూప‌ర్‌ 12కు ఎంపికవుతాయి. ఆ జ‌ట్లు 8 ఆటోమెటిక్ క్వాలిఫైయ‌ర్స్‌ తో క‌లుస్తాయి. ప్రిలిమ‌న‌రీ స్టేజిల్లో పోటీప‌డే దేశాల్లో బంగ్లాదేశ్‌, శ్రీలంక‌, ఐర్లాండ్‌, నెద‌ర్లాండ్స్‌, స్కాట్‌ల్యాండ్‌, న‌మీబియా, ఒమ‌న్‌, పప్వా న్యూ గునియాలు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లోని మిగిలిన మ్యాచులను యూఏఈలోనే పొట్టి కప్‌కు ముందు నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్ చేసింది. అదే విదంగా తాజాగా షెడ్డ్యూల్ కూడా విడుదల చేసింది.

ఇకపోతే, క్రికెట్ టీమిండియా లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదువలేకుండా పోవడం తో ఒక్కొక్క స్థానం కోసం ఇద్దరు , ముగ్గురు పోటీపడుతున్నారు. అక్టోబ‌ర్ 17వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 14వ తేదీ వ‌ర‌కు ప్రపంచకప్‌ మ్యాచులు జరగనున్నాయి. మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండడంతో అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. 2007లో ఛాంపియగ్‌ గా నిలిచిన భారత్ కూడా ఈసారి కప్ కొట్టాలని చూస్తోంది. అందుకోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం శ్రీలంకతో టీమిండియా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో సత్తాచాటిన ప్లేయర్స్ ఉన్నారు. అందులో కొందరు టీ20 ప్రపంచకప్‌ లో ఆడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే లంక సిరీసును మెగా టోర్నీ సన్నద్ధత కోసం ఉపయోగించుకుంటోంది.

అలాగే , ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులను కూడా భారత ఆటగాళ్లు ఉపయోగించుకోనున్నారు. ఇండియా జట్టులో ముఖ్యంగా ఓపెనింగ్ కోసం సీనియర్ల మద్యే పోటీ నెలకొంది. ఒక ఓపెనర్‌ గా రోహిత్ శర్మ అయితే వంద శాతం ఖాయం. మరో ఓపెనర్‌ గా శిఖర్ ధావన్‌, కేఎల్ రాహుల్ మధ్య పోటీ నెలకొంది. అయితే టీ20లు కాబట్టి వేగంగా ఆడాలి. ఇక్కడ స్ట్రైక్ రేట్ చాలా ముఖ్యం. ఇటీవలి స్ట్రైక్ రేట్ చూసుకుంటే.. మాత్రం అవకాశం రాహుల్‌ కే దక్కనుంది. రాహుల్, ధావన్ చేసిన గత 500 పరుగుల స్ట్రైక్ రేట్ చూసుకంటే.. టాప్‌ లో రాహుల్ ఉన్నాడు. అతడి స్ట్రైక్ రేట్ 142.2గా ఉంది. అదే సమయంలో గబ్బర్ స్ట్రైక్ రేట్ 127.4గా ఉంది. ఇది రాహుల్‌ కు కాస్త అనుకూలమనే చెప్పాలి. అయితే కెప్టెన్ కోహ్లీ ఎవరికీ మద్దతుగా నిలుస్తాడో.

మూడో స్థానంలో విరాట్ కోహ్లీ రానున్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌ ఓపెనింగ్ చేస్తే.. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌ లో వచ్చే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ కూడా మిడిల్ ఆర్డర్‌ పోటీ లో ఉన్నారు. వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ స్థానం ఖాయం. ఇక రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా ఆల్‌ రౌండర్‌ కోటాలో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్ పేస్ కోటా లో స్థానం కోసం పోటీపడుతుంటే , యుజ్వేంద్ర చహల్, కృనాల్ పాండ్యాలు స్పిన్ విభాగంలో పోటీలో ఉన్నారు. మొత్తంగా కెప్టెన్ కోహ్లీ కి టీం ను సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమే అని చెప్పవచ్చు.