వైసీపీలో ఆ ఆరు పదవులు ఎవరికి?

Mon Jul 13 2020 17:40:05 GMT+0530 (IST)

Who owns those six positions in the YCP?

ఏపీలో కొత్త పదవుల లోకం మొదలైంది. మంత్రులైన మోపిదేవి పిల్లి సుభాష్ లు రాజ్యసభకు వెళ్లిపోవడంతో రాజీనామాలు చేశారు. దీంతో ఆ రెండు మంత్రి పదవులు.. వారు వదిలేసిన ఎమ్మెల్సీ పదవులతోపాటు గవర్నర్ కోటాలోని మరో రెండు ఎమ్మెల్సీ పదవులు కూడా భర్తీ కావాల్సి ఉంది. అంటే 2 మంత్రి పదవులు.. 4 ఎమ్మెల్సీ పదవులు కలిపి మొత్తం 6 పదవులు. దీంతో ఈ పదవులపై వైసీపీలోని చాలా మంది గంపెడాశలు పెట్టుకున్నారు.ఈ ఆరు పదవులపై దాదాపు డజను మంది ఆశావహులు పోటీలో ఉన్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రెండు ఎమ్మెల్సీ సీట్లు బీసీలకు.. ఒకటి ఎస్సీకి మరొకటి మైనార్టీకి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

గత ఎన్నికల్లో తన సీటును చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీకి త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇక కడపకు చెందిన ఒక మైనారిటీ నేతకు ఎమ్మెల్సీ పదవి కన్ఫం అయినట్టు ప్రచారం సాగుతోంది. మరో రెండు ఎమ్మెల్సీలను బీసీలకు ఇస్తారని తెలుస్తోంది.

ఇక ఈనెల 22న జగన్ తన కేబినెట్ ను విస్తరించబోతున్నారని.. ఖాళీ అయిన మోపిదేవి పిల్లి సుభాష్ ల స్థానంలో కొత్తగా ఇద్దరినీ మంత్రులుగా తీసుకుంటారని సమాచారం.. ఈ పదవుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేశ్ పొన్నాడ సతీష్ కుమార్ చెల్లుబోయిన వేణుగోపాల్ సీదరి అప్పలరాజు కొలుసు పార్థసారథి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పలువురు ఎమ్మెల్సీలు ఈ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. దీంతో ఎవరికి మంత్రి పదవులు.. ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.