జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీని హత్య చేసింది ఎవరు?

Wed Jul 21 2021 14:28:32 GMT+0530 (IST)

Who murdered journalist Danish Siddiqui?

అఫ్ఘనిస్తాన్  నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లిపోతున్న నేపథ్యంలో.. ఆ దేశంలో అప్పుడే అలజడి ప్రారంభమైంది. ఇప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అశాంతి.. బలం పుంజుకుంటోంది. అఫ్ఘాన్ సరిహద్దులో వాస్తవ పరిస్థితిపై వివరాలు సేకరించేందుకు వెళ్లిన భారత్ ఫొటో జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌తో సరిహద్దు సమీపంలో తాలిబన్లు - ఆఫ్ఘన్ భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ దుర్ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఈ హత్య ఎవరు చేశారు? అన్నది తేలలేదు.ప్రఖ్యాత న్యూజ్ ఏజెన్సీ రాయిటర్స్ సంస్థలో చీఫ్ ఫొటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సిద్ధిఖీ.. తనదైన టాలెంట్ తో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీశారు. ఇందుకుగానూ.. విఖ్యాత పులిట్జర్ ఫ్రైజ్ సైతం అందుకున్నారు. తాజాగా అఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కెమెరాతో ఆఫ్గన్ లో అడుగు పెట్టారు. దక్షిణ అఫ్ఘాన్ లోని కాందహార్ ప్రావిన్స్ స్పిన్ బోల్డాక్ జిల్లాలో డ్యూటీ చేస్తున్న డానిష్.. ఇరు వర్గాలకు మధ్య జరిగిన దాడిలో చనిపోయారని వార్తలు వచ్చాయి. బుల్లెట్ గాయాలతోనే డానిష్ చనిపోయారని కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

అయితే.. డానిష్ ను హత్య చేశారని ఆఫ్ఘన్ కమాండర్ బిలాల్ అహ్మద్ చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది. అదికూడా.. కేవలం భారతీయుడన్న కారణంతోనే చంపేశారని చనిపోయిన తర్వాత కూడా మృతదేమం పట్ల దారుణంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఒక భారత మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఈ వివరాలు వెల్లడించినట్టు సమాచారం.

పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న స్పిన్ బోల్డాక్ పట్టణంలో జరిగిన ఘర్షణల సమయంలో తాలిబన్లు.. ఒక అధికారితోపాటు డానిష్ సిద్దిఖీని కూడా కాల్చి చంపారని ఆఫ్ఘన్ కమాండర్ వెల్లడించారు. అంతేకాదు.. డానిష్ సిద్ధిఖీ భారతీయుడని తెలుసుకున్న తర్వాత.. తాలిబన్లు మరింత రాక్షంగా ప్రవర్తించారని తెలిపారు. సిద్ధిఖీ చనిపోయిన తర్వాత కూడా అతని తలపై నుంచి వాహనాన్ని పోనిచ్చి వికృత వికటాట్టహాసాలు చేశారని వెల్లడించారు ఆఫ్ఘన్ కమాండర్.

అయితే.. తాలిబన్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రకటించడం గమనార్హం. భారత ఫొటో గ్రాఫర్ డానిష్ సిద్ధిఖీని తాము చంపలేదని అతని హత్యకు తమకు సంబంధం లేదని తాలిబన్ కమాండర్ మౌలానా యూసుఫ్ ప్రకటించారు. ‘‘మేము అతన్ని (డానిష్ సిద్ధిఖీ) చంపలేదు. అతను శత్రు దళాలతో ఉన్నాడు. ఎవరైనా జర్నలిస్ట్ ఇక్కడకు రావాలంటే.. అతను మాతో ముందుగా మాట్లాడాలి. మేము ఇప్పటికే దేశంలోని జర్నలిస్టులతో సన్నిహితంగా ఉన్నాం’’ అని మౌలానా యూసఫ్ అహ్మది ప్రకటించడం గమనార్హం.

దీంతో.. డానిష్ సిద్దిఖీని ఎవరు హత్య చేశారన్న విషయం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. తాలిబన్లే చంపారని ఆఫ్ఘన్ సైన్యం చెబుతుండగా.. తాము హత్య చేయలేదని వారు ప్రకటించారు. మరి ఈ మిస్టరీ ఎప్పుడు వీడుతుందన్నది చూడాలి. కాగా.. సిద్ధిఖీ మృతదేహాన్ని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీ (ఐసిఆర్‌సి) కు తాలిబాన్లు అప్పగించారు. ఆ తర్వాత డానిష్ సిద్దిఖీ మృతదేహాన్ని విమానం ద్వారా ఆదివారం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయానికి చేరింది. ఆ తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఇదిలాఉంటే.. అఫ్ఘనిస్తాన్ లో నుంచి అమెరికన్ సైన్యాలు వెనక్కి వెళ్లిపోతున్న సంగతి తెలిసిందే. జార్జ్ బుష్ హయాంలో 20 ఏళ్ల క్రితం అప్ఘనిస్తాన్ లో తాలిబన్లను ఆల్ ఖైదాను అంతమొందించేందుకు వచ్చిన అమెరికా సైన్యాలు.. సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశానికి వెళ్లిపోతున్నాయి. దీంతో.. తాలిబన్లు మళ్లీ బలం పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే మళ్లీ అలజడి చెలరేగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆగస్టు 31 నాటికి అమెరికన్ సైన్యాలు పూర్తిగా వెళ్లిపోతాయి. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.