Begin typing your search above and press return to search.

యానాంలో సీఎం అభ్యర్థిని ఓడించిన యువకుడు ఎవరంటే?

By:  Tupaki Desk   |   3 May 2021 3:30 AM GMT
యానాంలో సీఎం అభ్యర్థిని ఓడించిన యువకుడు ఎవరంటే?
X
గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ఎవరతను? అతని ప్రత్యేకత ఏమిటి? యువకుడైన అతడికి ఇంత హైప్ ఎందుకు? నిజంగానే అంత సీన్ ఉందా? లాంటి ప్రశ్నలు చాలానే వస్తాయి. గోదావరి జిల్లాల ప్రజలకు పరిచయస్తుడే కానీ.. మిగిలిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తిగా అపరిచితుడీ కుర్రాడు. ఇంతకూ ఇతను ఇప్పుడు వార్తల్లోకి రావటానికి కారణం.. అతను సాధించిన అపూర్వ విజయమే. పుదుచ్చేరి లాంటి చిన్న రాష్ట్రం కమ్ కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న సీనియర్ నేతను.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగటమే కాదు.. సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటంతో ఆయన పేరు ఇప్పుడు మారుమోగుతోంది.

తన గెలుపుతో 30 ఏళ్ల రాజకీయాల్ని తిరగరాసిన క్రెడిట్ ను సొంతం చేసుకున్నాడు. పూర్తిగా తెలుగువాడైన ఇతడు యానం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏప్రిల్ ఆరున జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజున వెల్లడయ్యాయి. ముందు నుంచి అనుకున్నట్లే పోటీ తీవ్రతరంగా సాగింది. 33వేల ఓట్లు ఉన్న నియోజకవర్గంలో తన ప్రత్యర్థి రంగస్వామిని 655 ఓట్ల తేడాతో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు.

తనను నమ్మి గెలిపించిన యానం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల్ని నెరవేరుస్తానని చెప్పిన అతడు..తన విజయంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాండిచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రంలో యానాం నియోజకవర్గ స్వరూపమే సిత్రంగా ఉంటుంది. కాకినాడతో దగ్గర సంబంధాలు ఉండే ఈ నియోజకవర్గంలో తమిళ వాసనలు.. కాసింత కేరళ జాడలతో పాటు.. తెలుగువారు ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. చూసేందుకు కేరళ రాష్ట్రంలో భాగంగా ఉండే ఈ నియోజకవర్గం ఆరేబియా సముద్రతీరంలో ఉన్న మాహె ప్రాంతం కూడా దీని కిందకే వస్తుంది.

ఈ నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతం తమిళనాడులో భాగంగా ఉండటంతో.. తమిళ ప్రభావం కూడా ఎక్కువే. ఇక్కడి రాజకీయం కాస్త భిన్నంగా ఉంటుంది. వ్యక్తుల చుట్టూనే నడుస్తుంది. పార్టీ కంటే కూడా వ్యక్తికే నియోజకవర్గ ప్రజలు ప్రాధాన్యత ఇస్తుంటారు. మొన్నటివరకు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన మల్లాడి కృష్ణారావు ఇటీవల వైసీపీలోకి చేరి.. జగన్ నాయకత్వంలో నడుస్తానని పేర్కొన్నారు. తనకు బదులుగా బరిలోకి దిగుతున్న రంగస్వామి గెలుపు కోసం ఆయన తీవ్రంగా కష్టపడ్డారు. ఒక దశలో పోటీలో ఉన్నది రంగస్వామే అయినా.. తానే స్వయంగా పోటీ చేస్తున్నట్లుగా మల్లాడి కృష్ణారావు వ్యవహరించారు.

రంగస్వామి రెండు స్థానాల నుంచి పోటీ చేయటం.. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఆయన.. రెండుచోట్ల గెలిస్తే.. ఏదో ఒక దానిలోనే కొనసాగే అవకాశం ఉండంతో.. యానం ప్రజలు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. కుర్రాడైన శ్రీనివాస్ కు అపూర్వమైన విజయాన్ని అందించారు. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విషయానికి వస్తే.. ఆయన తండ్రి కి యానాంలో మంచి గుర్తింపు ఉంది. బరిలో పదహారు మంత్రి అభ్యర్థులు ఉన్నప్పటికి.. గొల్లపల్లికి కాంగ్రెస్ కూడా మద్దతు ఇవ్వటంతో కలిసి వచ్చింది. దీనికి తోడు.. యువకుడైన గొల్లపల్లి మాటలు నియోజకవర్గ ప్రజల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. గతంలో ఏపీ కంటే డెవలప్ మెంట్ యానాంలో ఉండేదని.. ఇప్పుడు అందుకు భిన్నంగా మారిందన్న ఆయన మాటలు నియోజకవర్గ ప్రజల్ని సూటిగా తాకినట్లు చెబుతారు. స్థానికతను ఎన్నికల ఎజెండాగా మార్చటంలో సక్సెస్ అయిన గొల్లపల్లి వ్యూహాత్మకంగా వ్యవహరించి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి.