మండలి ఛైర్మన్ ఎవరవుతారబ్బా ?

Thu Apr 22 2021 12:00:01 GMT+0530 (IST)

Who is the Chairman of the Council?

శాసనమండలి ఛైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి ఎవరిని నియమిస్తారనే అంశంపై అధికారపార్టీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఛైర్మన్ ఎంఏ షరీఫ్ టీడీపీ ఎంఎల్సీ అన్న విషయం అందరికీ తెలిసిందే. షరీఫ్ పదవీకాలం మే 24వ తేదీతో ముగుస్తోంది. మండలిలో ప్రస్తుతం వైసీపీ బలం మైనారిటిలోనే ఉన్నా జూన్ 18వ తేదీ తర్వాత మెజారిటిలోకి వస్తుంది. అప్పటికి అధికారపార్టీ బలం 30కి చేరుకుంటుంది. కాబట్టి ఛైర్మన్ పదవి వైసీపీ దక్కటం ఖాయం.ఈ విషయం తెలుసుకాబట్టే అధికారపార్టీ ఎంఎల్సీలు ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అయితే ఛైర్మన్ పదవిని స్ధూలంగా ఎస్సీ లేదా బీసీలకు కేటాయించే ఆలోచనలో జగన్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. జగన్ ఆలోచన అనేందుకు ఆధారాలైతే లేదుకానీ ప్రచారం జరుగుతున్నది మాత్రం వాస్తవం.

అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జగన్ ఎక్కువగా బీసీ ముస్లిం మైనారిటిలు మహిళలు ఎస్టీ కాపులకు ప్రాధాన్యతిస్తున్నారు. కాబట్టే రాబోయే ఛైర్మన్ పదవిని కూడా బీసీ లేదా ఎస్సీలకు కేటాయించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ప్రస్తుత ఛైర్మన్ ముస్లిం మైనారిటి కాబట్టి మళ్ళీ అదే సామాజికవర్గం నేతతోనే భర్తీ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదనే వాదన కూడా ఉంది. మొత్తంమీద జూన్ తర్వాత అసెంబ్లీలో లాగే మండలిలో కూడా వైసీపీకి ఎదురుండదన్నది వాస్తవం.