ఆ ఆరు స్థానాల అభ్యర్థుల వెనక ఉన్నదెవరు?

Sun Nov 28 2021 14:00:23 GMT+0530 (IST)

Who is behind the candidates for those six positions

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పన్నెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవం అయిన స్థానాలను మినహాయిస్తే.. ఆరు స్థానాల్లో పోటీ తప్పదన్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ కు ఉన్న బలాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ స్థానాలు గులాబీ కారు ఖాతాలో పడటం పెద్ద విషయం కాదు. కానీ.. స్థానిక సంస్థల నేతలకు గులాబీ బాస్ కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఉన్న గుర్రు.. పింకీ బ్యాచ్ కు కొత్త గుబులుగా మారిందని చెప్పాలి.ఈ విషయాన్ని తాజాగా గుర్తించిన సీఎం కేసీఆర్.. పోటీ అనివార్యమైన ఆరు స్థానాల్లో గెలుపును ఖాయం చేసుకునేందుకు వీలుగా పావులు కదపటం మొదలు పెట్టారు. నిజానికి.. పన్నెండు స్థానాల్ని ఏకగ్రీవం చేసుకోవటం ద్వారా.. ఎన్నికలు జరగకుండా ఉండేలా ప్లాన్ చేశారు. అనూహ్యంగా అభ్యర్థులు బరిలోకి నిలవటం.. వారిని పోటీ నుంచి తప్పుకోవాలంటూ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవటంతో పోలింగ్ అనివార్యమైన పరిస్థితి.

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియటం.. ఆరు స్థానాలకు ఎన్నికలు ఖాయమని తేలిన నేపథ్యంలో.. ఎన్నికలు జరుగుతున్న స్థానాల్ని కొత్త జిల్లాలుగా కాకుండా.. పాత జిల్లాల లెక్కను పరిగణలోకి తీసుకొని.. ఎన్నికల వ్యూహాన్ని సీఎం కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల సమన్వయ బాధ్యతల్ని మంత్రులకు అప్పజెప్పారు.

మొత్తంగా జరుగుతున్న ఆరు స్థానాల్లో మెదక్.. ఖమ్మం మినహా మిగిలిన నాలుగు స్థానాల బరిలో నిలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థుల వెనుక కాంగ్రెస్.. బీజేపీ నేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి చేరిన నేతల సంఖ్యను చూసినప్పుడు.. ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి ఎలాంటి ఇబ్బంది లేనట్లే. కానీ.. మారిన సమీకరణాల నేపథ్యంలో సదరు ఇండిపెండెంట్ అభ్యర్థుల వెనుక ఉన్న ఇతర పార్టీల నేతలు రంగంలోకి దిగటం టీఆర్ఎస్ వర్గాలకు కొత్త టెన్షన్ గా మారింది.

కరీంనగర్ లో  ఎంపీ కమ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబులు తమకు అనుకూలంగా ఉండే ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని బరిలోకి దించారు. టీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఏదో రీతిలో ఓటమి పాలు చేయటం ద్వారా కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వటంతో పాటు.. ఆయన పూర్తిస్థాయి ఆత్మరక్షణలో పడేలా చేయటమే లక్ష్యమంటున్నారు.

ఇందులో భాగంగానే మెదక్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగ్గారెడ్డి తన సర్వశక్తులు ఓడ్డటంతో ఈ ఎన్నిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డికి మద్దతు పలుకుతున్నారు. దీంతో..కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక అశించినంత సింపుల్ గా పూర్తి కాదని.. టీఆర్ఎస్ నేతలకు చెమటలు పట్టించటం ఖాయమని చెప్పాలి. ఇదిలా ఉంటే.. పుష్పరాణికి ఎంపీ సోయం బాపూరావుతో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా దన్నుగా నిలిచినట్లుగా చెబుతున్నారు.

తన ఉప ఎన్నిక వేళలో.. తనను ఎంతలా ఇబ్బంది పెట్టారో మర్చిపోని ఈటల.. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ బ్యాచ్ కు ఎదురుదెబ్బ తగిలేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలకు ఇదో తలనొప్పిగా మారింది. ఇక.. నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సోదరుల అండతో బరిలో నిలిచిన అభ్యర్థి కూడా గులాబీ దళానికి చెమటలు పట్టిస్తున్నారు. ఖమ్మంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. ఎమ్మెల్యే పోడెం వీరమయ్య కాంగ్రెస్ అభ్యర్తికి ఓటర్ల మద్దతు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో.. టీఆర్ఎస్ కు కొత్త టెన్షన్ మొదలైన పరిస్థితి.