Begin typing your search above and press return to search.

జాతీయ స్థాయిలో రాజీవ్ మెహర్షి పేరు ఎందుకు మారుమోగుతోంది?

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:45 AM GMT
జాతీయ స్థాయిలో రాజీవ్ మెహర్షి పేరు ఎందుకు మారుమోగుతోంది?
X
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీకి ఎదురే లేని పరిస్థితి. ఆయనేం చెప్పినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మెజార్టీ ప్రజలు ఆయన వెంటే ఉన్నారన్న భావన తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆరేళ్ల పాలనలో ఆర్థికంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పినా.. దాని కారణం ఫలానా అని చెప్పలేని పరిస్థితి. గత ప్రభుత్వాల మాదిరి అవినీతి ఆరోపణలు మోడీ సర్కారు మీదనే లేవు. దీంతో.. కుంభకోణాలు ఏమీ చోటు చేసుకోని వేళ.. దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది.

అందుకు భిన్నంగా రోజు రోజుకి ఆర్థికంగా దేశం తీవ్రమైన ప్రతికూల పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటుందన్న ప్రశ్నకు అందరికి అర్థమయ్యేలా సమాధానం చెప్పే వారు కనిపించని పరిస్థితి. ఇలాంటివేళ.. కొద్ది రోజుల క్రితం విడుదలైన కాగ్ రిపోర్టు పెను సంచలనంగా మారింది. మోడీ సర్కారు చేసిన తప్పుల్ని ఎండగట్టటమే కాదు.. మోడీ ప్రభుత్వానికి అతి పెద్ద సవాలుగా తాజా కాగ్ రిపోర్టు మారింది.

కాగ్ కు జనరల్ గా వ్యవహరిస్తున్న రాజీవ్ మెహర్షీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే.. కాగ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలే దీనికి కారణంగా చెబుతున్నారు. మోడీ సర్కారు తప్పుల్ని ఎత్తి చూపటమే కాదు.. దాని కారణంగా జరిగిన నష్టాల్ని లెక్క కట్టింది. దీనంతటికి కారణమైన కాగ్ జనరల్ రాజీవ్ మెహర్షి రూపొందించిన నివేదిక ప్రకంపనల్ని క్రియేట్ చేస్తుంది. 1978 బ్యాచ్ కు చెందిన రాజస్థాన్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి.

రాజస్థాన్ రాష్ట్రంలో కీలక బాధ్యతల్ని ఆయన చేపట్టారు. అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన ఆయన.. కేంద్ర ఆర్థిక శాఖ.. ఎరువుల శాఖతో పాటు విదేశీ వ్యవహారాల శాఖలోనూ కార్యదర్శిగా వ్యవహరిచారు. 2017లో రిటైర్ అయిన ఆయన.. రిటైర్మెంట్ తీసుకున్న పక్క రోజునే కాగ్ జనరల్ గా నియమితులయ్యారు. రాజీవ్ మెహర్షి 13వ కాగ్ జనలర్ గా బాధ్యతలు చేపడితే.. ఆయన స్థానంలో 14వ కాగ్ జనరల్ గా జీసీ ముర్మును ఎంపిక చేశారు. తన హయాంలో ఆయన రూపొందించిన కాగ్ నివేదికను గత ఏడాది జనవరిలోనే ప్రభుత్వానికి సమర్పించారు. కానీ.. దాన్ని ఈ నెల 23న మోడీ సర్కారు ఉభయ సభలకు సమర్పించటం గమనార్హం.