లేడీ కపిల్ దేవ్.. ఎవరామె? ఎందుకనో తెలుసా?

Sat Sep 24 2022 16:29:20 GMT+0530 (India Standard Time)

Who is Lady Kapil Dev? Do you know why?

దాదాపు నలభై ఏళ్ల కిందట.. భారత్ లో ఫాస్ట్ బౌలరా? అంటూ నోరెళ్లబెట్టేవారు. అప్పడంతా వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పేసర్లదే హవా. మనదగ్గర నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ రావడం అంటే అది కష్టమే. కానీ అప్పుడే వచ్చాడు ఓ కుర్రాడు. పెద్దగా పేస్ ఏమీ లేకపోయినా.. కచ్చితత్వంతో కెరీర్ ఆసాంతం రాణించాడు. బంతితోనే కాక బ్యాట్ తోనూ అదరగొట్టాడు.అతడు రిటైరై 30ఏళ్లు అవుతోంది. మళ్లీ అలాంటి స్థాయి క్రికెటర్ భారత క్రికెట్ కు దొరకలేదు. అతడిలోని సగం ప్రతిభ ఉన్నవారు కూడా మనకు చిక్కలేదు అంటే అతిశయోక్తి కాదేమో..? అతడే కపిల్ దేవ్.భారత పురుషుల క్రికెట్ లో కపిల్ గురించి మనం ఇంతగా ఎందుకు చెప్పుకొన్నామంటే.. మహిళల క్రికెట్ లోనూ అచ్చం అలానే ఓ క్రికెటర్ ఉంది. ఆమె జులన్ గోస్వామి. అచ్చం పురుషుల క్రికెట్ లో ఎలాగైతే కపిల్ కు ముందు కపిల్ తర్వాత అని చెప్పుకొంటామో..? మహిళల క్రికెట్ లో జులన్ కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి.భారత పేసర్ అంటే ఆమె..భారత మహిళల క్రికెట్ లో మిథాలీ రాజ్ లేడీ సచిన్ అయితే జులన్ గోస్వామి లేడీ కపిల్ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఆమెది రెండు దశాబ్దాల కెరీర్. భారత మహిళల ఫాస్ట్ బౌలింగ్ కు పర్యాయ పదంగా నిలిచింది జులన్. చిత్రమేమంటే.. మిథాలీ జులన్ అండర్ -19 దశ నుంచి కలిసి ఆడారు. బ్యాటింగ్ లో మిథాలీ బౌలింగ్ లో జులన్ పెద్ద దిక్కుగా నిలిచారు.

అలాంటి గోస్వామి శనివారం తన కెరీర్ లో చివరి వన్డే ఆడుతోంది. ప్రఖ్యాత లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ ఆమెకు చివరిది కానుంది. విజయంతో జులన్‌కు వీడ్కోలు పలకాలని టీమ్‌ఇండియా పట్టుదలతో కనిపిస్తోంది. ఈ సీనియర్ పేసర్ కోసం సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్.. గెలుపు దిశగా జట్టును నడిపించాల్సి ఉంది.

మిథాలీ లాగే కల నెరవేరకుండా..కెరీర్‌లో భారత్ ప్రపంచకప్ గెలవకపోవడం లోటుగా జులన్ తెలిపింది. ఆమె ప్రాతినిథ్యం వహించిన కాలంలో 2 ప్రపంచకప్ ఫైనల్స్ ఆడినా టీమిండియా ఓడింది. కప్పు గెలవడమనేది ప్రతి క్రికెటర్ కలకు ఆమె అలా దూరమైంది. మరోవైపు తాను ఇంతకాలం కొనసాగుతానని అనుకోలేదని ఇదో గొప్ప అనుభవం అని జులన్ తెలిపింది. కాగా గోస్వామిది పశ్చిమ బెంగాల్ కు చెందిన మధ్య తరగతి కుటుంబం. శిక్షణ కోసం లోకల్ రైల్లో ప్రతి రోజు 5 గంటలు ప్రయాణం చేసేది. మొదట్లో క్రికెట్ గురించి ఏమీ తెలియని ఆమెనే.. అమ్మాయిల క్రికెట్ ఎదుగుదలకు ప్రతిరూపంగా నిలవడం విశేషం.  1997లో ఈడెన్ గార్డెన్స్‌లో బాల్ గర్ల్‌గా తొలిసారి మహిళల ప్రపంచకప్ ఫైనల్ చూసి ప్రభావితమై.. దేశానికి ప్రాతినిథ్యం వహించాలని నిశ్చయించుకుంది.

కాగా కెరీర్ ఆసాంతం మిథాలీతో సమాంతరంగా సాగిన జులన్.. మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని నెలల్లోనే ఆటకు వీడ్కోలు పలుకుతుండడం గమనించాల్సిన ముఖ్య విషయం.అంతేకాదు.. వీరిద్దరూ 2002లో ఇంగ్లండ్ లోని టాంటన్ లో రికార్డు స్థాయిలో 214 పరుగులు జోడించారు. 2014లో ఇంగ్లండ్ లో చారిత్రక టెస్టు విజయంలో గోస్వామి 4 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించింది.

కెరీర్లో 350 వికెట్లు భారత్ కు 12 టెస్టులాడిన జులన్.. 44 వికెట్లు పడగొట్టింది. 203 వన్డేల్లో 253 వికెట్లు 68 టి20ల్లో 56 వికెట్లు తీసింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన మహిళా క్రికెటర్ ఈమెనే. ఒకవేళ బీసీసీఐ కనుక మహిళల క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ ను రూపొందిస్తే జులన్ అందులో కచ్చితంగా ఉంటుంది. 2010లో కేంద్ర ప్రభుత్వం జులన్ కు అర్జున అవార్డు ఇచ్చింది. 2015 నుంచి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్డు జాబితాలో ఉంది. కపిల్ దేవ్ లాగే లోయరార్డర్ లో ఉపయుక్త బ్యాట్స్ మన్ అయిన జులన్ స్థాయి క్రికెటర్ భారత మహిళల క్రికెట్ కు మళ్లీ దొరుకుతుందో లేదో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.