Begin typing your search above and press return to search.

ఎవరీ గల్లా శ్రీనివాసరావు? వైసీపీ నేతలు అతన్ని చంపేస్తామంటున్నారా?

By:  Tupaki Desk   |   15 Aug 2022 4:20 AM GMT
ఎవరీ గల్లా శ్రీనివాసరావు? వైసీపీ నేతలు అతన్ని చంపేస్తామంటున్నారా?
X
ఏపీలో అధికార..విపక్షాల మధ్య రాజకీయం ఎంతలా ఉందన్న విషయం తెలిసిందే. బలమైన అధికారపక్షం.. దానికి ప్రతిగా పోరాడే ప్రతిపక్షం ఉంటే రాజకీయ వాతావరణం రచ్చ రచ్చగా ఉంటుంది. గడిచిన కొన్నేళ్లుగా ఏపీలో ఇలాంటి పరిస్థితే నెలకొంది.తాజాగా విశాఖపట్నానికి చెందిన గల్లా శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త విశాఖ పోలీసులకు చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది. ఎప్పటిలానే టీడీపీ సోషల్ మీడియాతో పాటు.. ఆ పార్టీ కార్యకర్తలు.. సానుభూతిపరులు.. అభిమానులు వైసీపీ నేతల ఆరాచకం ఏ స్థాయిలో ఉందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీ నేతలు తనను చంపేస్తామని హెచ్చరిస్తున్నారని.. తనపై దాడికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరుతున్నారు. ఇంతకీ ఈ గల్లా శ్రీనివాసరావు ఎవరు? ఎంత టీడీపీ కార్యకర్త అయితే చాలు.. అలా చంపేస్తామని బెదిరిస్తారా? అన్నది ప్రశ్న. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్న విషయంలోకి వెళితే.. గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ నేత ఓడిపోవటం.. దానికి తానే కారణమని భావించటంతోనే తనకు సమస్య వచ్చినట్లు ఆరోపిస్తున్నారు.

సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుగా ఉన్న కోన శ్రీను ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని.. దానికి తానే కారణమని నమ్ముతున్నట్లు చెప్పారు. అప్పటినుంచి తనపై దాడికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 'గత ఆగస్టు 5న నా కారు అద్దాలు పగల కొట్టారు. కోన శ్రీను వచ్చి మా ఇంటి గేట్లు తన్ని నా అంతు చూస్తానన్నాడు.

గత డిసెంబరు 26న పంచాయితీ వార్డు మెంబరుభర్త అప్పారావు.. ఆయన కొడుకులు ఇద్దరు నా మీద ఇనుప రాడ్లతో తలపై గాయపర్చారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశా. స్థానిక ఎమ్మెల్యే చేత ఒత్తిడి చేయటంతో వారిపై హత్యానేరం కాకుండా చిన్న కేసు పెట్టారు.

ప్రస్తుతం తనపై దాడి చేసిన రామ్కుమార్ కు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వచ్చింది. నా కేసు వారికి అడ్డుగా మారింది. దీంతో.. ఆ కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదు' అంటూ వాపోతున్నాడు.

దీనిపై స్థానిక పోలీసుల వెర్షన్ వేరుగా ఉంది. ఇరు వర్గాల్ని తాము పిలిపించామని.. వార్నింగ్ ఇచ్చామని.. విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. శ్రీనివాసరావుకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. ఇన్ని మాటలు చెప్పే బదులు.. కంప్లైంట్ ఆధారంగా కేసులు ఎందుకు నమోదు చేయటం లేదన్న మాట టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. విశాఖతోపాటు ఈ తరహా ఇబ్బందులు రాష్ట్రంలోని పలు చోట్ల ఉన్నట్లుగా టీడీపీ నేతలు వాపోతున్నారు.