Begin typing your search above and press return to search.

12 సార్లు ఎన్నికలు జరిగిన మునుగోడులో ఎవరెన్నిసార్లు గెలిచారంటే?

By:  Tupaki Desk   |   4 Oct 2022 4:42 AM GMT
12 సార్లు ఎన్నికలు జరిగిన మునుగోడులో ఎవరెన్నిసార్లు గెలిచారంటే?
X
గడిచిన కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉపపోరుకు సైరన్ మోగటం తెలిసిందే. అంచనాలకు కాస్త భిన్నంగా.. ఆశించిన దాని కంటే ముందుగా ఉప ఎన్నికను నిర్వహించేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయటం.. మరో నెలలో కీలక ఎన్నిక పోలింగ్ పూర్తి కావటమే కాదు.. ఫలితం కూడా వెలువడే షెడ్యూల్ విడుదల కావటం తెలిసిందే. ఈ ఉపపోరు ఫలితం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేయటమే కాదు.. పలు పార్టీల ఫ్యూచర్ ను కూడా డిసైడ్ చేస్తుందని చెప్పాలి.

తరచూ వార్తల్లో నిలుస్తున్న మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గాన్ని 1967లో ప్రారంభిస్తే.. ఇప్పటివరకు ఆ నియోజకవర్గానికి పన్నెండుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు జరిగే ఉప పోరు పదమూడోది. ఈ స్థానంలో అత్యధిక సార్లు గెలుపొందిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇదే నియోజకవర్గంలో సీపీఐ సైతం ఐదుసార్లు విజయాన్ని సొంతం చేసుకుంది.

1967 నుంచి 1985 వరకు కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్దన్ రెడ్డి విజయం సాధిస్తే.. 1985 నుంచి సీపీఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 1999లో కాంగ్రెస్ నుంచి పాల్వాయి మరోసారి గెలవగా..

2009లో జరిగిన ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి ఉజ్జిని యాదగిరిరావు విజయాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వేళలో జరిగిన ఎన్నిక (2014)లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.

ఇటీవల ఆయన కాంగ్రెస్ ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకోవటం.. దానికి ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏ మాత్రం పట్టులేని ఈ స్థానంలో రాజగోపాల్ రెడ్డి చేరికతో బీజేపీ తాను గెలుస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తుండగా..

తెలంగాణలో తన పట్టు ఇప్పటికి తగ్గలేదని నిరూపించుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తుంటే.. పూర్వ వైభవాన్ని తిరిగి సాధించేందుకు తాజా ఉప పోరు కాంగ్రెస్ కు కీలకంగా మారింది. మరి.. నియోజకవర్గ ఓటర్లు ఈసారెలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.