Begin typing your search above and press return to search.

కేశినేనికి పోటీగా జగన్ దింపుతున్న లీడర్ ఇతడే

By:  Tupaki Desk   |   15 Jun 2021 4:30 PM GMT
కేశినేనికి పోటీగా జగన్ దింపుతున్న లీడర్ ఇతడే
X
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ముందే ప్రత్యామ్మాయాలు రెడీ అవుతున్నాయి. ఖాళీగా ఉన్న చోట్లలో నేతలు ఫిలప్ అయిపోతున్నారు. బలమైన టీడీపీ నేతలున్న చోట్ల సీఎం జగన్ అంతే బలమైన నేతలను తయారు చేస్తున్నాడు.

కీలకమైన ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం ఎంపీ సీటులో టీడీపీ కీలక నేత రామ్మోహన్ నాయుడును ఓడించేందుకు స్పీకర్ తమ్మినేని సీతారం కుమారుడితోపాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తనయుడిని సీఎంజగన్ రెడీ అవుతున్నారు. ఇద్దరినీ బలమైన నేతలుగా తీర్చిదిద్దుతున్నాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరిని రామ్మోహన్ నాయుడిపై పోటీ పెట్టి ఓడించాలన్నదే జగన్ పట్టుదలగా తెలుస్తోంది.

ఇక రాజధాని అమరావతి పరిధిలో బలంగా ఉన్న టీడీపీ నేతలను జగన్ టార్గెట్ చేసేశారు. కీలకమైన విజయవాడ, గుంటూరు ఎంపీ సీట్లపై కూడా జగన్ తోపాటు వైసీపీ కీలక నేతలు దృష్టిసారిస్తున్నారు.గత ఎన్నికల్లో గుంటూరులో సామాజిక సమీకరణాలు తేడా కొట్టడంతో ఈ ఎంపీ సీటును స్వల్ప తేడాతో కోల్పోవాల్సి వచ్చిందని వైసీపీ భావిస్తోంది. ఈ సారి ఆయా సామాజికవర్గాలకే పెద్దపీట వేయాలని వైసీపీ భావిస్తోంది.

ఇక కీలకమైన విజయవాడ సీటును కూడా చేజేతులారా ఓడిపోయామన్న బాధ వైసీపీలో ఉంది. చివర్లో వచ్చిన పీవీపికి ఈ సీటు ఇవ్వడం వల్లే ఓడిపోయామని భావిస్తున్నారు. కేశినేని ప్రజల్లో ఉండే నేత కావడం.. బలమైన మాస్ ఫాలోయింగ్..కమ్మ సామాజికవర్గం తోడు ఉండడంతో స్వల్ప తేడాతో వైసీపీ వేవ్ ను తట్టుకోని గెలిచారంటున్నారు.

అందుకే ఈసారి విజయవాడలో కేశినేనికి చెక్ పెట్టడానికి బలమైన కమ్మనేతను జగన్ రెడీ చేస్తున్నారు. ప్రజల్లో మంచి పేరున్న నేతలనే రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. ఈ సీటులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధన్ రావుతోపాటు ఆయన సోదరుడు ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి జై రమేశ్ పేరును పరీశీలిస్తున్నట్టు సమాచారం. జైరమేశ్ వైపే మొగ్గు కనిపిస్తోందంటున్నారు. చూడాలి మరీ ఈ నేతలు టీడీపీ నేతలకు బలమైన ప్రత్యామ్మాయంగా మారుతారో లేదో చూడాలి.