కరోనాపై మరోసారి గుండెలు అదిరేమాట చెప్పారుగా?

Tue Aug 04 2020 14:20:33 GMT+0530 (IST)

Who Shocking Statement On Corona Virus

ప్రపంచంలోని పరిణామాల్ని పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు సలహాలు.. సూచనలు.. అవసరానికి తగ్గట్లు హెచ్చరికలు జారీ చేయటం ప్రపంచ ఆరోగ్య సంస్థ చేయాల్సిన పని. తాను చేయాల్సిన పనిని ఈ సంస్థ ఎంత దారుణంగా చేసిందో కరోనా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. వూహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఎంత ప్రమాదకారి అన్న విషయాన్ని గుర్తించి.. ప్రపంచాన్ని హెచ్చరించటంలో ఈ సంస్థ దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఆ కారణంగానే.. ఈ రోజున యావత్ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.ఇదిలా ఉంటే.. కరోనాకు సంబంధించి రెండు.. మూడు రోజుల క్రితమే ఈ సంస్థ బాంబులాంటి మాటను బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు సొల్యూషన్ లేదని.. కనీసం పదేళ్లు అయినా తప్పదన్న మాట చెప్పటంతో యావత్ ప్రపంచం విస్తుపోయింది. ఈ ఏడాది చివరకు కానీ వచ్చే ఏడాది మొదట్లో కానీ వ్యాక్సిన్ వస్తుందన్న దానికి భిన్నంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్యలు ఉండటం పలువురిని విస్తుపోయేలా చేసింది.

ఇది సరిపోదన్నట్లుగా తాజాగా ఆ సంస్థ మరో కీలక వ్యాఖ్యను చేసింది. టీకా రూపకల్పనలో ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నా.. అంత సులువుగా పరిష్కారం లభించే అవకాశం లేదని పేర్కొంది. వ్యాక్సిన్ గురించి ఎదురుచూసే కన్నా.. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన టెస్టింగ్.. ట్రేసింగ్.. భౌతికదూరం.. మాస్కు ధరించటంలాంటి ప్రాథమిక అంశాల మీదనే ప్రజలు.. ప్రభుత్వాలు దృష్టి పెట్టాలంటోంది. తాజాగా సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసియస్ మీడియాతో మాట్లాడుతూ.. వైరస్ మూలాల్ని కనుగొనేందుకు అంతర్జాతీయ బృందం చైనా పరిశోధకులతో కలిసి ప్రయత్నిస్తుందని చెప్పారు.

ప్రస్తుతానికైతే ఈ వైరస్ ను రూపుమాపే సులువైన పద్దతి అంటూ ఏమీ లేదన్న ఆయన.. ఆ మాటకు వస్తే అలాంటి చికిత్స ఎప్పటికి రాకపోవచ్చని పేర్కొనటం గమనార్హం. ఇదంతా విన్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నది ప్రజలకు భరోసా కలిగించే కన్నా భయం కలిగించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందా? అన్న సందేహం కలుగక మానదు.