కేసీఆర్ ఎక్కడ పోటీచేసినా పోటీగా బరిలో ఈటలనేనట?

Tue Dec 06 2022 13:00:01 GMT+0530 (India Standard Time)

Etala Rajender Believes Wherever KCR Contests, he Will Contest Against him

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. అప్పుడే కదా హీరోగా నిలిచేది. తనను మంత్రిపదవి నుంచి తొలగించి అష్టకష్టాలు పెట్టి.. భూములు లాగేసుకొని రాజకీయంగా అణగదొక్కిన కేసీఆర్ ను టార్గెట్ చేశారు ఈటల రాజేందర్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ పోటీచేసినా ఆయనపై పోటీచేస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే గజ్వేల్ లో సీరియస్ గా వర్క్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈటల స్పష్టం చేశారు. బెంగాల్ లో బీజేపీ నేత సువేందు అధికారి ఎలాగైతే బెంగాల్ సీఎం మమతను ఓడించాడో.. తాను కేసీఆర్ ను ఓడిస్తానని శపథం చేశాడు.గతంలోనే ఈటల రాజేందర్ ఈ ప్రకటన చేశారు. కేసీఆర్ పోటీచేసే గజ్వేల్ లో అయినా.. మరొక చోట అయినా సరే తాను రెడీ అని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ఘాటించారు. బీజేపీ హైకమాండ్ కూడా కేసీఆర్ పై ఈటల రాజేందర్ నే పోటీకి దింపాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఈటలకు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఇటీవలే ఈటల ఢిల్లీలో ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై పోటీ.. ఎలా ఎదుర్కోవాలన్న అంవంపై ఆయనకు బ్లూ ప్రింట్ ఇచ్చినట్టుగా  భావిస్తున్నారు.

తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ఇప్పటికే రకరకాలు వ్యూహాలు రచిస్తోంది.   పార్టీని పటిష్ట పరిచేందుకు చేరికలను ప్రోత్సహించాలని నిర్ణయించింది.  రాష్ట్రంలో ‘ముందస్తు’ ఊహాగానాలు ఎక్కువగా వస్తుండడంతో కొంత మంది నాయకులు పార్టీలు మారేందుకు రెడీగా ఉన్నారు.

ముఖ్యంగా టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలు ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే కాంగ్రెస్ బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు.  అలాంటి వారికి ఆఫర్లు ప్రకటించి పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ బాధ్యతలను ఈటల రాజేందర్ కు అప్పగించారు. బీజేపీలో చేరిక కమిటీ కన్వీనర్ గా ఈటలను నియమించారు. ఇంతకాలం రాజేందర్ కు ప్రాధాన్యం లేదని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకు ఈ బాధ్యతను అప్పగించడంతో పార్టీ కోసం ఇక సీరియస్ గా పనిచేయనున్నారు.

ఈ మధ్యన ఈటల రాజేందర్ తరుచుగా గజ్వేల్ లో పర్యటిస్తున్నారు. అక్కడ కేసీఆర్ సొంత నియోజకవర్గం కావడం.. మళ్లీ పోటీ చేస్తాడు కాబట్టి అక్కడ పరిస్థితిని కొంచెం కొంచెం మారుస్తున్నాడు. గతంలో కేసీఆర్ కు ప్రత్యర్థిగా ప్రతాప్ రెడ్డి ఉండేవాడు. ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ప్రత్యర్థి లేకుండా పోయాడు. ఇప్పుడు ఈటల రాజేందర్ సరైన ప్రత్యర్థి అవుతాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ పై ఈటల పోటీచేస్తే ఖచ్చితంగా జనాల్లో ఆలోచన వస్తుంది. ఏజెండా మారిపోతుంది. కేసీఆర్ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డానని.. న్యాయం కావాలని ఈటల ప్రచారం చేస్తే సీన్ మారిపోతుంది. టీఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకునే అవకాశం ఉంటుంది. బెంగాల్ లో మమతను ఓడించినట్టే తెలంగాణలో కేసీఆర్ ను ఓడిస్తే మాత్రం బీజేపీ బలం ఖచ్చితంగా పుంజుకుంటుంది. ఎమ్మెల్యేలంతా జారిపోయి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.