Begin typing your search above and press return to search.

విశాఖ నడిరోడ్డు మీద అందరూ చూస్తున్నప్పుడే రౌడీషీటర్ ను ఏసేశారు

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:05 AM GMT
విశాఖ నడిరోడ్డు మీద అందరూ చూస్తున్నప్పుడే రౌడీషీటర్ ను ఏసేశారు
X
ప్రశాంతంగా ఉండే సిటీగా పేరున్న ఉక్కునగరం ఉలిక్కిపడే ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం విశాఖ వీధుల్లోని రద్దీగా ఉండే రహదారి మీద రౌడీషీటర్ ను దారుణంగా హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో అందరూ చూస్తుండగానే హతమార్చారు. అయితే.. సదరు రౌడీషీటర్ స్నేహితులే అంత దారుణంగా చంపేసినట్లుగా చెబుతున్నారు. అందరి ఎదుట చంపేసి.. ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అసలేం జరిగిందంటే..

విశాఖకు చెందిన 36 ఏళ్ల అనిల్ కుమార్ అప్పు ఘర్ వద్ద ఉంటాడు. అతనికి ఎంవీపీ కాలనీలో ఉండే శ్యామ్ స్నేహితుడు. కారు డ్రైవర్ గా పని చేసే అనిల్ మీద రౌడీషీట్ ఉంది. ఒక హత్య కేసులో నిందితుడిగా అనిల్ మీద కాకినాడలోనూ రౌడీషీట్ ఉంది. తన గురించి అనిల్ హేళనగా మాట్లాడుతున్న విషయాన్ని తెలుసుకున్న శ్యామ్ అతడి మీద కోపం పెంచుకున్నాడు.

గతంలో క్రికెట్ ఆడే వేళలోనూ వారిద్దరి మధ్య గొడవ కావటం.. మళ్లీ కొందరి జోక్యంతో వారిద్దరూ స్నేహితులు అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎంపీవీకాలనీ ఆదర్శనగర్ లోని ఒక బార్ లో అనిల్.. శ్యామ్ తో పాటు మరో ఇద్దరు మిత్రులు బాగా తాగేశారు. చాలాసేపు మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో వారి మధ్య వాదులాటు మొదలైంది. అది కాస్తా చూస్తుండగానే పెద్దదైంది. సాయంత్రం నాలుగు.. నాలుగున్నర గంటల ప్రాంతంలో బార్ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో వారి మధ్య మొదలైన వాదులాట పెరిగి పెద్దదైంది. తొలుత తోపులాటతో మొదలై దాడి వరకు వెళ్లింది.

ఈ క్రమంలో శ్యామ్ తో పాటు మరొకరు అనిల్ పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. దవడ.. ఎడమ భుజం.. ఛాతీ.. పొట్టపైనా కత్తి పోట్లు వేసి.. అనంతరం పీక కోసేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జరుగుతున్న షాకింగ్ ఉదంతంతోఅక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారు. తీవ్ర రక్తస్రావంతో అనిల్ అక్కడికక్కడే మరణించాడు.

అనిల్ కు పలువురితో గొడవలు ఉన్నాయని చెబుతున్నారు. రౌడీ షీట్ ఉండటంతో అతడ్ని ఎదిరించే విషయంలో స్థానికులు వెనక్కి తగ్గేవారని చెబుతున్నారు. ముందస్తు పథకంలో భాగంగానే శ్యామ్ అతడ్ని బాగా తాగించి హత్య చేశాడా? అన్న కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది. నడిరోడ్డు మీద హత్య చేసిన శ్యామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు అధికారికంగా అతడ్ని అదుపులోకి తీసుకున్న విషయాన్ని వెల్లడింలేదు.