Begin typing your search above and press return to search.

నిమ్మ‌కాయ‌తో ప్ర‌భుత్వం నిల‌బ‌డుతుందా... బెంగ‌ళూరు అసెంబ్లీలో క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   19 July 2019 12:16 PM GMT
నిమ్మ‌కాయ‌తో ప్ర‌భుత్వం నిల‌బ‌డుతుందా... బెంగ‌ళూరు అసెంబ్లీలో క‌ల‌క‌లం
X
కన్నడ అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొనే వేళ రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. కన్నడ రాజకీయంలో ఎప్పుడు ఏం ? జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ క్రమంలోనే శుక్రవారం శాసనసభలో నిమ్మకాయల కలకలం రేగింది. కుమారస్వామి సోదరుడు మంత్రి హెచ్‌ డీ రేవణ్ణ‌ తన వెంట ఓ నిమ్మకాయను తెచ్చుకోవడంతో ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వైపు అసెంబ్లీలో బలపరీక్ష వేళ సీరియస్ చర్చ నడుస్తుంటే.. రేవణ్ణ‌ చేతిలో నిమ్మకాయలు చూసిన బిజెపి ఎమ్మెల్యేలు ఉలిక్కిపడి స్పీకర్ రమేష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అరగంట పాటు చర్చ బలపరీక్ష మీద కాకుండా నిమ్మకాయ మీద జరగటం విచిత్రం.

కుమారస్వామి కుటుంబానికి భక్తి పాళ్లు కాస్త ఎక్కువే. ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే గుళ్ళు గోపురాలు తిరుగుతారు... కనపడిన దేవుళ్ళందరికీ మొక్కుతారు. అంతెందుకు బ‌ల‌ప‌రీక్ష‌కు ఒక రోజు ముందు కూడా కుమారస్వామి నివాసంలో భారీ ఎత్తున హోమం నిర్వహించారు. కుమారస్వామి కుటుంబం ఎక్కువగా చాముండేశ్వరి అమ్మవారిని పూజిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే గురువారం సభ ముగిసిన వెంటనే మంత్రి రేవణ్ణ‌ మైసూరు కు వెళ్లి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజలు చేశాక‌ ఆలయ అర్చకులు ఇచ్చిన నిమ్మకాయను అప్పటి నుంచి తన వెంటే ఉంచుకున్నారు.

ఈరోజు ఉదయం రేవణ్ణ‌ ఆ నమ్మకంతోనే అసెంబ్లీలోకి ప్రవేశించడం.. ఆ నిమ్మకాయకు కుంకుమ ఉండడంతో బిజెపి సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవణ్ణ‌ చేతబడి చేసిన నిమ్మకాయను అసెంబ్లీలోకి తీసుకువచ్చార‌ని... దాన్ని తమపై ప్రయోగిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెంటనే ఆ నమ్మకాన్ని బయటపడాలని కూడా బిజెపి సభ్యులు నినాదాలు చేశారు. బిజెపి సభ్యులు నిమ్మకాయ కోసం ఆందోళన చేస్తుండడంతో సీఎం కుమారస్వామి నవ్వుకున్నారు. చేతబడి చేసి ప్రభుత్వాన్ని కాపాడుకోవడం వీలవుతుందా ? అని కూడా ప్రశ్నించారు. తమ కుటుంబానికి దేవుళ్ళు, భార‌తీయ సంస్కృతి, సంప్ర‌దాయాలంటే అపారమైన భక్తి ఉందని... గుడిలో పూజలు చేసి తీసుకు వచ్చిన నిమ్మ‌కాయ చూసి బిజెపి సభ్యులు ఆందోళన చేయటం... భయపడటం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు.