జగన్ ఢిల్లీ టూర్ లో ఏం జరగనుంది? ఎవరెవరిని కలవనున్నారు?

Thu Jun 10 2021 10:02:39 GMT+0530 (IST)

What will happen in Jagan's Delhi tour? Who do you want to meet?

నాలుగైదు రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు.. పెండింగ్ ఇష్యూలపై కేంద్రంలోని పెద్దలతో మాట్లాడేందుకు ఆయన ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. అధికారిక ప్రకటన వెలువడలేదు. అనంతరం.. టూర్ క్యాన్సిల్ అయ్యిందన్న మాట బయటకు వచ్చింది. ఇది  ప్రచారంలోకి వచ్చిన రెండు రోజులకే జగన్ ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడటం విశేషం.ఈ రోజు ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానంలో సీఎం జగన్ వెళ్లనున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు.. విభజన సమస్యలపై వారితో చర్చలు జరపనున్నారు. ఇప్పటివరకు కన్ఫర్మ్ అయిన షెడ్యూల్ ప్రాకరం జల వనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. రైల్వే శాఖ మంత్రి గోయల్ తో పాటు ఇతరుల్ని కలవనున్నారు.

రాత్రి తొమ్మిది గంటల వేళలో కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ తర్వాత ఆయన ఢిల్లీలోనే బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం ఢిల్లీలో బయలుదేరి.. మధ్యాహ్నానానికి తాడేపల్లికి చేరుకోనున్నట్లు చెబుతున్నారు.  ఈ టూర్ ను పలు వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.  ఒక వైపు బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రావటం.. మరోవైపు సొంత  పార్టీ రెబల్ ఎంపీ రఘురామ ఇష్యూతో పాటు.. మరిన్ని అంశాలు కూడా చర్చకు వస్తాయన్న చర్చ సాగుతుంది.