Begin typing your search above and press return to search.

సంచలనంగా మారిన ది వైర్ కథనంలో ఏముంది?

By:  Tupaki Desk   |   19 July 2021 4:08 AM GMT
సంచలనంగా మారిన ది వైర్ కథనంలో ఏముంది?
X
చాలా రోజుల తర్వాత.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి కథనంతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది ‘ది వైర్’ మీడియా సంస్థ. దేశ రాజకీయాల్ని కుదిపేసేలా చేసేలా బోల్డ్ కథనాన్ని పబ్లిష్ చేయటమే కాదు.. ఈ రోజు (సోమవారం) నుంచి షురూ అయ్యే పార్లమెంటు సమావేశాలకు ఎజెండాను సెట్ చేసిందని చెప్పాలి. పలువురు కేంద్ర మంత్రులతో పాటు.. ప్రతిపక్ష నేతలు.. జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయంటూ సంచలనాత్మక కథనాన్ని పబ్లిష్ చేసి షాక్ కు గురి చేసింది. తాజాగా లీక్ అయిన ఒక డేటా బేస్ లో వారందరి ఫోన్ నెంబర్లు ఉన్నట్లుగా తేల్చింది.

ఇజ్రాయెల్ కు చెందిన ‘పెగాసన్’ అనే స్పైవేర్ సాయంతో ఈ హ్యాకింగ్ వ్యవహారం సాగినట్లుగా తెలుస్తుందని ‘ది వైర్’ తన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. వాస్తవానికి ఈ స్పైవేర్ ప్రభుత్వాల వద్దే అందుబాటులో ఉంటాయి. నిఘా కార్యకలాపాల కోసం దాన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్ఎస్ వో గ్రూపు అమ్ముతుంటుంది. తాజాగా బయటకు వచ్చిన డేటా బేస్ ను పరిశీలించిన వారు.. తాజా హ్యాకింగ్ లో ప్రభుత్వ పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం చేసేలా తాజా కథనం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఈ కథనంపై కేంద్రం స్పందించింది. తమ జోక్యం ఏమీ లేదని తేల్చి చెరప్పింది. దేశ పౌరుల గోప్యత హక్కును పరిరక్షించేందుకు తాను కట్టుబడి ఉన్నట్లుగా స్పష్టం చేస్తూ.. హ్యాకింగ్ ఆరోపణల్ని కొట్టి పారేసింది. ది వైర్ కథనంలోని అంశాల్ని చూస్తే.. పెగాసన్ తో టార్గెట్ చేసిన వారి జాబితాలో 300 మందికి పైగా భారతీయులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరి ఫోన్ నెంబర్లు తాజా డేటాబేస్ లో ఉన్నాయని.. అందులో కీలక కేంద్రమంత్రుల నెంబర్లతో పాటు ప్రతిపక్ష నేతలు.. న్యాయ నిపుణులు.. జర్నలిస్టులు.. ప్రభుత్వ అధికారులు.. వ్యాపార వేత్తలు.. హక్కుల కార్యకర్తలు.. శాస్త్రవేత్తల పేర్లు ఉండటం కలకలానికి మూల కారణం.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వీరిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టులోని ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ఫోన్ నెంబరు కూడా ఇందులో ఉండటం గమనార్హం. భారత్ తో పాటు పలు దేశాల (బహ్రెయిన్.. హంగేరి.. మెక్సికో.. మొరాకో.. అజర్ బైజాన్.. సౌదీ అరేబియా తదితర)కు చెందిన ప్రముఖుల పేర్లు తాజా డేటా బేస్ లో ఉండటం విశేషం. భారత మీడియా సంస్థలైన హిందూస్థాన్ టైమ్స్.. ది వైర్.. ఇండియా టుడే.. నెట్ వర్కు 18.. ది హిందూ.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ తదితర సంస్థలకు చెందిన వారి నెంబర్లు ఉన్నాయి. ఈ హ్యాకింగ్ కథనాన్ని అంతర్జాతీయంగా పేరున్న వాషింగ్టన్ పోస్టుతో సహా మొత్తం 16 విదేశీ వార్తా సంస్థలు ప్రచురించాయి.

ఫోన్ నెంబర్లు ఉన్నంత మాత్రాన హ్యాకింగ్ కు గురైనట్లేనా? అన్న సందేహానికి సదరు కథనంలో సమాధానాన్ని ఇచ్చేశారు. తొలుత ఇలాంటి సందేహాలు రావటంతో.. జాబితాలో ఉన్న పది మంది ఫోన్లపై స్వతంత్ర డిజిటల్ ఫోరెన్సిక్ విశ్లేషణ చేయించగా.. వారిపై అప్పటికే హ్యాకింగ్ ప్రయత్నం జరగటమో.. విజయవంతంగా హ్యాకింగ్ ముగిసినట్లుగా తేలింది. దీంతో.. మిగిలిన వారిపై కూడా ఇప్పటికే హ్యాకింగ్ జరిగి ఉంటుందన్న విశ్లేషణలు వెల్లడవుతున్నాయి. ఈ కథనం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. మోడీ సర్కారు ఆత్మరక్షణలో పడేలా చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి.. ప్రభుత్వం ఏలా రియాక్టు అవుతుందో చూడాలి.