Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు మరో రాజీనామా .. దాసోజు వైదొలగడానికి కారణమేంటి?

By:  Tupaki Desk   |   5 Aug 2022 10:33 AM GMT
కాంగ్రెస్ కు మరో రాజీనామా .. దాసోజు వైదొలగడానికి కారణమేంటి?
X
తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ ను షేక్ చేస్తోంది. తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే అన్న వెంకటరెడ్డి కూడా వెళ్లబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఇద్దరి తలనొప్పినే తట్టుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానానికి మరో షాక్ తగిలింది.

తాజాగా కాంగ్రెస్ వాయిస్ గా చెప్పుకునే అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ పార్టీకి రాజీనామా చేయడం సంచలనమైంది. సీనియర్ నేత, మంచి వాక్చాతుర్యం.. టీవీ డిబేట్లలో గట్టిగా బల్లగుద్ది వాదించే దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడడం కలకలం రేపుతోంది. ఒక్కో కీలక నేతగా చేజారిపోతుంటే కాంగ్రెస్ వాదులు షాక్ అవుతున్నారు.

ఓవైపు రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం పాత కాంగ్రెస్ సీనియర్లను చేరదీసి పార్టీలో చేర్చుకుంటుంటే మరోవైపు కీలక కాంగ్రెస్ నేతలంతా పార్టీని వీడుతుండడం ఆ పార్టీకి షాకింగ్ గా మారింది.

ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా దాసోజు శ్రవణ్ ఉన్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు తన రాజీనామాకు కారణం చెప్పబోతున్నాడు.అయితే ఇన్ సైడ్ కథనం ప్రకారం.. దాసోజు శ్రవణ్ రాజీనామాకు ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు కారణంగా చెబుతున్నారు. ఇటీవల పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ కౌన్సిలర్ అయిన విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆ చేరిక సందర్భంగా రేవంత్ రెడ్డి సహా కీలక నేతలు అధిష్టానం ఖైరతాబాద్ సీటుపై హామీ ఇచ్చారు.

ఖైరతాబాద్ సీటును దాసోజు శ్రవణ్ ఆశించారు. ఆ సీటుపైనే పనిచేస్తున్నారు. దీంతో తన ఖైరతాబాద్ లో వేరొకరని చేర్చుకోవడాన్ని దాసోజు శ్రవణ్ తట్టుకోలేకపోయారు. అందుకే రాజీనామా చేసినట్టు తెలిసింది.

టీఆర్ఎస్ లో కీలక నేతగా.. అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్ కు అప్పట్లో కేసీఆర్ కూడా అసెంబ్లీ సీటు ఇవ్వలేదు. అందుకే ఆయన కాంగ్రెస్ లోచేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీ సీటు ఇచ్చినా.. నల్గొండ జిల్లాలో ఇవ్వడంతో గెలవలేకపోయారు. ఖైరతాబాద్ కావాలని అడిగినా ఇప్పుడు కాంగ్రెస్ మరొకరని చేర్చుకోవడంతో అలిగి రాజీనామా చేసినట్టు తెలిసింది.