Begin typing your search above and press return to search.

ఉప్పు.. నిప్పు మధ్య సీక్రెట్ భేటీ.. కర్ణాటకలో ఏమవుతోంది?

By:  Tupaki Desk   |   14 Oct 2021 4:38 AM GMT
ఉప్పు.. నిప్పు మధ్య సీక్రెట్ భేటీ.. కర్ణాటకలో ఏమవుతోంది?
X
ఉప్పు.. నిప్పు కలవటం ఉంటుందా? రూపాలే కాదు.. వాటి స్వభావాలు.. సిద్ధాంతాలు విరుద్ధంగా ఉండే ఇద్దరు అగ్రనేతల మధ్య జరిగినట్లుగా చెబుతున్న రహస్య భేటీ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో కొత్త కలకలానికి తెర తీసింది. భిన్న ధ్రువాలుగా చెప్పే మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య (కాంగ్రెస్).. యడియూరప్ప (బీజేపీ) మధ్య ఒక రహస్య భేటీ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇటీవల యడ్డి సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరిగాయని.. దీనికి కారణం సిద్దరామయ్య.. యడియూరప్పలు ఈ మధ్యన అర్థరాత్రి వేళ రహస్యంగా భేటీ అయ్యారని.. ఈ విషయం తెలిసినంతనే రాష్ట్రంలోని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలు స్పందించాయని.. అందుకే సోదాలు జరిగినట్లుగా కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. యడ్డీ సీఎంగా ఉన్న వేళలో.. బీజేపీ అధినాయకత్వం ఆయన్ను తప్పించటం తెలిసిందే. సరైన కారణం లేకుండానే ఆయన్ను పక్కన పెట్టేసి నేపథ్యంలో.. యడ్డీ ఈ విషయంలో గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు.

అందుకు భిన్నంగా తాజాగా కుమారస్వామి చేసిన ఆరోపణతో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. యడ్డీని నియంత్రించేందుకు వీలుగా.. ఐటీ సోదాలు జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. యడ్డి కుమారుడు విజయేంద్ర సన్నిహితుల ఇళ్ల మీద ఐటీ సోదాలు జరగటం.. లెక్కల్లో చూపని రూ.750 కోట్లు బయటపడిన వైనం తెలిసిందే. ఇందులో రూ.487 కోట్ల ఆదాయాన్ని తాము లెక్కల్లోకి చూపించలేదని సదరు సంస్థలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే..

తాము రహస్య భేటీ అయ్యామన్న ఆరోపణల్ని ఇరువురు అగ్రనేతలు కొట్టిపారేశారు. ఒకవేళ తాము రహస్యంగా భేటీ అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాలు విసిరారు. తామిద్దరికి కరోనా వచ్చి ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ కలవలేదని.. యడ్డీని పదే పదే కలిసింది కుమారస్వామినే అంటూ సిద్దరామయ్య ఫైర్ అయ్యారు. ఏమైనా.. ఈ ఉదంతం కన్నడనాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.