Begin typing your search above and press return to search.

ఇద్దరి మధ్యన ఏముంది : రాష్ట్రపతి కావాల్సిన వెంకయ్యనాయుడుకి ఎందుకిలా...?

By:  Tupaki Desk   |   30 Jun 2022 11:44 AM GMT
ఇద్దరి మధ్యన ఏముంది : రాష్ట్రపతి కావాల్సిన  వెంకయ్యనాయుడుకి ఎందుకిలా...?
X
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒక డిఫరెంట్ రాజకీయ నాయకుడు. ఆయన పొలిటికల్ హిస్టరీ చూస్తే చాలా అరుదైన ఘటనలు కనిపిస్తాయి. ఆయన 2001లో అనూహ్య పరిస్థితుల్లో గుజరాత్ కి ముఖ్యమంత్రి అయ్యారు. దాని కంటే ముందు ఆయన మరే కీలకమైన పదవిని చేపట్టలేదు, కనీసం ఎమ్మెల్యేగా కూడా ఆయన నెగ్గలేదు అలా ఆయనకు అంతా కలసి వచ్చి ఏకంగా ఒక సంపన్నమైన రాష్ట్రానికే సీఎం అయ్యారు.

ఇక అలా వరసబెట్టి గెలవడమూ ఆయన రాజనీతితో పాటు సమర్ధతతో పాటు జాతకం కూడా సహకరించింది అని చెప్పాలి. మరో వైపు చూస్తే మోడీ ఏకంగా పదమూడేళ్ళ పాటు నిరాటంకంగా గుజరాత్ కి సీఎం అయ్యారు. ఆ తరువాత నేరుగా ఢిల్లీకి వచ్చి ప్రధాని అయ్యారు. రెండు సార్లు ఫుల్ మెజారిటీతో భారత్ లాంటి దేశాన్ని పాలించడమూ మోడీ ఘనతే. అయితే మోడీ బీజేపీలో ఉన్నపుడు కానీ ఆరెస్సెస్ లో ఉన్నపుడు కానీ ఆయనకు సహకరించిన నాయకులు చాలా మంది ఉన్నారు.

వారిలో అతి ముఖ్యుడు తండ్రి గురువు అయిన ఎల్కే అద్వానీ. 2002లో గోద్రా అల్లర్ల సమయంలో మోదీని దింపేయాలనే దాదాపుగా ప్రధాని వాజ్ పేయ్ నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో అడ్డు చక్రం వేసి ఆదుకున్నది ఎవరో కాదు గురువు అద్వానీయే. ఒకవేళ నాడే మోడీ మాజీ అయితే ఆయన రాజకీయ జీవితం ఇంతదాకా వచ్చేదా అంటే అది పెద్ద సందేహంగానే చూడాలి.

అలాంటి అద్వానీకి మోడీ ప్రధాని అయ్యాక ఏమి చేసి రుణం తీర్చుకున్నారు అన్న ప్రశ్న వస్తే మాత్రం జవాబు కడు బరువుగా ఉంటుంది. దేశానికి ప్రధాని కావాలన్నది అద్వానీ కోరిక. ఆయన అన్ని విధాలుగా అర్హుడు కూడా. బీజేపీని ఆ స్థాయిలో తెచ్చి నిలబెట్టిన వారు. 1998లో బీజేపీకి మంచి విజయం లభించాక మొదట అద్వానీయే ప్రధాని అవుతారని అంతా అనుకున్నారు. అలనాడు వాజ్ పేయి ని ప్రధానిని చేసి డిప్యూటీగా అద్వానీ సర్దుకున్నారు.

అలా మోడీ కూడా గురు దక్షిణ అలా తీర్చుకుంటారు అని భావించారు. అయితే అది మాత్రం జరగలేదు. ఇక శిష్యుడు మంత్రివర్గంలో అద్వానీ మంత్రిగా పనిచేయడం అసంభవం. దాంతో ఆయనకు సముచితంగా ఉంటుంది. బీజేపీ పెద్దను ఒక ఉన్నత స్థానంలో నిలిపినట్లుగా ఉంటుంది అని భావిస్తే 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అద్వానీకి ఆ పదవి ఇచ్చి ఉండాల్సింది. అంతా అదే మోడీ చేస్తారు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అలా అద్వానీ పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది.

ఇక వెంకయ్యనాయుడు విషయానికి వస్తే ఆయన కరడు కట్టిన ఆరెస్సెస్ భావజాలం ఉన్న నాయకుడు. అద్వానీకి వీర భక్తుడు. మోడీ కంటే సీనియర్. మోడీ 2001లో గుజరాత్ సీఎం అయ్యేనాటికే వెంకయ్యనాయుడు కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. అలాగే బీజేపీ జాతీయ ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఉన్నారు. ఇక ఆయనకు మోడీతో బంధం గురించి చెప్పాలీ అంటే మంచి స్నేహితుడిగా చూసారు అని చెబుతారు.

గుజరాత్ అల్లర్ల వేళ మోడీ పదవికి ముప్పు వస్తే గురువు అద్వానీతో పాటు వెంకయ్యనాయుడు కూడా వాజ్ పేయ్ కి నచ్చచెప్పి సీఎం సీట్లో మోడీ కుదురుకునేలా చేశారు అంటారు. ఇక మోడీ ప్రధాని అభ్యర్ధిగా 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున ఉంటే కాలికి బలపం కట్టుకుని వెంకయ్యనాయుడు దక్షిణాది రాష్ట్రాలలో తిరిగారు. ఆ విధంగా తన పలుకుబడి ఉపయోగించి మోడీ గురించి ప్రచారం చేశారు.

ఇక ఎలాంటి భేషజాలకు పోకుండా మోడీ మంత్రివర్గంలో చేరి కీలక శాఖలు చూశారు. అలాంటి వెంకయ్యనాయుడుని 2017లో ఉప రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టి రాజకీయంగా మోడీ సైడ్ చేశారు అని అంటారు. ఒక విధంగా ఉజ్వలంగా వెంకయ్యనాయుడు మరో పదేళ్ళ పాటు జాతీయ రాజకీయాల్లో వెలగవలసి ఉండగా మోడీ మాత్రం ఆయనను అలా పక్కన పెట్టేశారు అన్న ప్రచారం అయితే ఉంది.

పోనీ ఈసారి రాష్ట్రపతి అయినా వెంకయ్యనాయుడు అవుతారు అనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారని నెట్టింట మారు మోగుతోంది. రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్ధిగా వెంకయ్యనాయుడు పేరుని కనీసం పరిశీలించలేదు అని అంటున్నారు. ఇపుడు ఉప రాష్ట్రపతి పదవి లో వెంకయ్యనాయుడిని కంటిన్యూ చేస్తారు అనుకోవడం కూడా భ్రమే అని అంటున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే వెంకయ్యనాయుడుతో మోడీకి ఏముంది అని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన అంటే ఎందుకంత వైరం ఉన్నట్లూఅ వ్యవహరించారు అని కూడా నెట్టింట ప్రశ్నల పరంపర సాగుతోంది ఏది ఏమైనా వెంకయ్యనాయుడు మాత్రం ఉన్న పదవితో తృప్తి చెంది తన శేష జీవితాన్ని ప్రశాంతంగానే ముగిస్తారు అని అంతా ఆశిస్తున్నారు.

అయితే మోడీ మాత్రం పట్టుబట్టి వెంకయ్యనాయుడు పట్ల ఇలా వ్యవహరించారా అలా అయితే ఎందుకు అన్న ప్రశ్నలకు బహుశా జవాబులు అయితే ఎవరి వద్దా ఉండవు. దానికి ఎవరికి తోఛినట్లుగా వారు చెప్పుకోవడమే. లేకపోతే రేపటి రోజున తన రాజకీయ జీవితం గురించి వెంకయ్యనాయుడు ఆత్మ కధ ఏదైనా రాస్తే బహుశా అందులో సమాధానాలు దొరకవచ్చేమో.