Begin typing your search above and press return to search.

ఏమిటీ స్ల్పింటర్ నెట్? ‘‘WWW’’ బీటలు పడుతున్నాయా?

By:  Tupaki Desk   |   23 Feb 2021 3:30 AM GMT
ఏమిటీ స్ల్పింటర్ నెట్? ‘‘WWW’’ బీటలు పడుతున్నాయా?
X
ఇప్పుడంటే గూగుల్.. యాహు.. బింగ్ లాంటి సెర్చింజన్లు ఉన్నాయి. ఏదైనా కీ వర్డ్ కొడితే.. సెర్చి చేసి బోలెడంత సమాచారాన్ని అందిస్తుంటాయి. కానీ.. ఇరవై ఏళ్ల క్రితం ఇంటర్నెట్ లో ఏదైనా వెతకాలంటే ‘‘WWW’’ అని మొదలుపెట్టాల్సి వచ్చేది. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో అలాంటివన్నీ అధిగమించి.. సింఫుల్ గా ఏం రాసినా దానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని క్షణాల్లో కళ్ల ముందుకు తీసుకొచ్చే పరిస్థితి. గతంలో ఈమొయిల్ ఓపెన్ చేసుకోవటానికే పది నిమిషాలు పట్టే పరిస్థితి. ఇక.. ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసి.. అందులో సమాచారం వెతకటం అంటే గంటల తరబడి సమయం ఖర్చు అయిపోయేది.

పెరిగిన సాంకేతికత కొత్త సమస్యల్ని తీసుకొస్తోంది. ‘‘WWW’’ అంటే.. వరల్డ్ వైడ్ వెబ్. అంటే.. ప్రపంచంలోని ఏ మూల సమాచారం ఉన్నా ఇట్టే తీసుకొచ్చేయటం. అయితే.. ఇదంతా గతం కానుంది. ఏ దేశానికి ఆ దేశం.. తమ సమాచారాన్ని మిగిలిన వారితో పంచుకోవటానికి ఇష్టపడటం లేదు. దీంతో.. రానున్న రోజుల్లో ఇంటర్నెట్ కాస్తా స్ల్పింటర్ నెట్ కానుంది. అంటే.. ఎవరికి వారికి ముక్కలు ముక్కలుగా సమాచారం అందటమే.

గతంలో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా ఇంటర్నెట్ మారిస్తే.. ఇప్పుడు అందులోనూ దేశాల సరిహద్దుల్నిగీసేసి.. పరిమితుల్ని విధించే పరిస్థితి రానుంది. ప్రపంచ రాజకీయాలు.. ఆ దేశ అంతర్గత భద్రత.. ఆందోళనలు.. మత విద్వేషాలు.. వాణిజ్య యుద్దాలు.. సైబర్ దాడులతో పాటు.. గూగుల్.. ఫేస్ బుక్.. ట్విటర్ లాంటి దిగ్గజ సంస్థల పుణ్యమా అని స్థానిక ప్రభుత్వాలు సమాచారంపై నియంత్రణ కోరుకుంటున్నాయి.

ఒక రకంగా చెప్పాలంటే సమాచార సార్వభౌమాధికారాన్ని తమ సొంతమన్న విషయాన్ని గూగుల్.. ఫేస్ బుక్ లాంటి కంపెనీలకు స్పష్టం చేస్తున్నాయి. చైనా ఇటీవల కొత్త ఇంటర్నెట్ సెన్సార్ షిప్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆ దేశానికి సంబంధించిన 100 రంగాల సమాచారాన్ని అనుమతి లేకుండా ఇంటర్నెట్ లో పెట్టటానికి ఆ దేశం ఒప్పుకోదు. అంతేకాదు.. అంతర్జాతీయ సంస్థలకు ధీటుగా బైదు.. అలీబాబా.. టెన్సెంట్ రూపంలో తనదైన ఇంటర్నెట్ దిగ్గజాల్ని సిద్ధం చేసుకుంది. ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే పని చేసేవే. దీంతో.. ప్రభుత్వం కోరుకున్న సమాచారం మాత్రమే బయటకు వచ్చే వీలుంది. అదే సమయంలో సదరు సంస్థలు.. తమ కంపెనీల్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించటానికి ప్రయత్నాలు చేయటం చూస్తే..డ్రాగన్ దుర్మార్గపు ఎత్తుగడులు ఏ రీతిలో ఉంటాయో అర్థమవుతుంది.

సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సైతం చైనాకు తలొగ్గింది. ఆ దేశ నియంత్రణను తట్టుకోలేని గూగుల్ మూట సర్దేశింది. ఇప్పుడు కాస్త తగ్గి చైనా ప్రభుత్వ విధానాలకు ఓకే చెప్పి.. దాని సూచనలకు తగ్గట్లు గూగుల్ డ్రాగన్ ఫ్లై అనే ఒక ప్రాజెక్టును స్టార్ట్ చేసింది. మిగిలిన ప్రపంచంలోని గూగుల్ కు దీనికి పోలికే ఉండంటున్నారు. ఇలాంటి తీరును ఒక్క చైనానే కాదు.. కొరియాతో పాటు ఇరాన్, బ్రెజిల్.. యూరోప్ లోని పలు దేశాలు ఇదే బాట పడుతున్నాయి. ఇదే పోకడ భారత్ లోనూ ఉంటుందా? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటికే టిక్ టాక్ ను బ్యాన్ చేయటంతో పాటు.. వ్యవసాయ చట్టాల మీద సాగుతున్న ఆందోళన వేళ.. ట్విటర్ పై కేంద్రం ప్రదర్శించిన ఆగ్రహమే దీనికి నిదర్శనం అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.