Begin typing your search above and press return to search.

మెడికల్ ఆక్సిజన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు?

By:  Tupaki Desk   |   22 April 2021 3:29 AM GMT
మెడికల్ ఆక్సిజన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు?
X
ఇప్పటివరకు వినని మాట ఇప్పుడు వినిపిస్తోంది. కరోనా మొదటి దశలో సమస్యగా అనిపించని మెడికల్ ఆక్సిజన్ ఇప్పుడు మహా కొరతగా మారింది. ఆక్సిజన్ అందక పోతున్న ప్రాణాలు ఎన్నో. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలు కేంద్రాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు ప్రత్యేక రైళ్లను పట్టాల మీదకు తీసుకొచ్చారు. యుద్ధ ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు.

ఇంతకూ మెడికల్ ఆక్సిజన్ అంటే ఏమిటి? దాన్ని ఎలా తయారు చేస్తారు? నష్టాల బూచిని చూపించి ప్రైవేటు పరం చేసేందుకు అమ్మకానికి పెట్టినప విశాఖ ఉక్కు పరిశ్రమ.. కరోనా సెకండ్ వేవ్ వేళ కేంద్రానికి బాసటగా నిలవటమే కాదు.. భారీ ఎత్తున మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇంతకీ.. ఆ పరిశ్రమలో ఆక్సిజన్ ను ఎందుకు అంతలా తయారు చేస్తారు? అన్న ప్రశ్న పలువురి మదిలో మెదులుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

కోవిడ బాధితులకు శ్వాస సంబంధమైన సమస్యలు ఏర్పడినప్పుడు మెడికల్ ఆక్సిజన్ ను అందిస్తారు. ప్రాణవాయువుగా చెప్పే ఆక్సిజన్ రోగుల్ని కాపాడే విషయంలో కీలకంగా వ్యవహరిస్తోంది. నిజానికి ఆక్సిజన్ తయారీ పారిశ్రామిక అవసరాలు కూడా భారీగా ఉంటాయి. అందుకే భారీ పరిశ్రమల్లో ఆక్సిజన్ తయారీ యూనిట్లను నెలకొల్పుతారు.

ఉక్కు.. ఇనుము.. మందుల తయారీ కంపెనీల్లో ఆక్సిజన్ అవసరం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు తమ కర్మాగారాల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల్ని ఏర్పాటు చేసుకుంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లోనూ ఇండస్ట్రియల్ ఆక్సిజన్ యూనిట్ ఉంది. ఇందులో తయారయ్యే ఆక్సిజన్ లో కొంత భాగాన్ని ఇతర అవసరాల కోసం లిక్విడ్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్ ద్వారా మెడికల్ ఆక్సిజన్ గా మారుస్తారు. వైద్య పరిభాషలో మెడికల్ ఆక్సిజన్ గా పేర్కొంటారు.

ఇంతకీ.. మెడికల్ ఆక్సిజన్ అంటే మరేమిటో కాదు.. ఆక్సిజన్ లో ఉండే చిన్న చిన్న మలినాల్ని శుద్ధి చేస్తే.. దాన్నే మెడికల్ ఆక్సిజన్ గా చెప్పొచ్చు. కాకుంటే దీన్ని లిక్విడ్ రూపంలో తయారు చేస్తారు. మన పీల్చే గాలిలో ఆక్సిజన్ 20.95 శాతం.. నెట్రోజన్ 78 వాతం.. చాలా తక్కువగా ఆర్గాన్.. నియాన్.. కార్బన్ డైయాక్సైడ్.. హీలియం.. హైడ్రోజన్ వాయువులు ఉంటాయి. చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ కాంబినేషన్ లో ఏ మాత్రం తేడా కొట్టినా.. మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి.

పరిశ్రమల్లో తయారయ్యే ఆక్సిజన్ లో 95 నుంచి 99 శాతం వరకు నాణ్యతతో కూడిన ఆక్సిజన్ ఉంటుంది. కాకుంటే కొంత మలినాలతో కలిసి ఉంటుంది. దీన్ని మరింతగా శుద్ధి చేసి..మెడికల్ ఆక్సిజన్ గా రూపొందిస్తారు. మనిషి శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని అధిగమించేందుకు లిక్విడ్ రూపంలో ఉన్న మెడికల్ ఆక్సిజన్ ను వాయువు రూపంలో మార్చటాన్ని మెడికల్ ఆక్సిజన్ గా వ్యవహరిస్తారు.

ఉక్కు పరిశ్రమల్లో ఆక్సిజన్ అవసరం ఏమిటన్న సందేహానికి సమాధానాన్ని వెతికితే.. రోలింగ్ మిల్స్.. ఫర్నేస్.. స్టీల్ ను వివిధ ఆకారాల్లో కట్ చేయటానికి.. ఎస్ఎంఎస్ ప్లాంట్.. లేజర్ సెట్టింగ్ లంటి వాటికి.. అలాగే వివిధ ప్రాసెసింగ్ వ్యవస్థల దగ్గర ఇగ్నిషియన్ కోసం దీన్ని వినియోగిస్తుంటారు. ఉక్కు పరిశ్రమలో తమ అవసరాల కోసం ఆక్సిజన్ ను పెద్ద ఎత్తున తయారు చేస్తారు. తాము ఉత్పత్తి చేసిన దానిలో కొంత భాగాన్ని మరింత శుద్ధి చేసి.. మెడికల్ ఆక్సిజన్ ను సిద్ధం చేసి ఆసుపత్రులకు.. వైద్య అవసరాల కోసం సరఫరా చేస్తారు.

తాజా విషయానికి వస్తే..విశాఖ ఉక్కు పరిశ్రమ తాను తయారుచేసే ఆక్సిజన్ ను పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ గా మార్చి.. పలు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున పంపుతోంది. ఏపీ.. తెలంగాణ.. ఒడిశా.. మధ్యప్రదేశ్.. మహారాష్ట్రాలకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే 500 టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను పంపినట్లుగా చెబుతున్నారు. తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. మరింత మెడికల్ ఆక్సిజన్ ను ఉత్పత్తిని పెంచమని చెప్పటంతో.. విశాఖ ఉక్కు కర్మాగారం ఆ దిశలో ఏర్పాట్లు చేస్తోంది.