Begin typing your search above and press return to search.

సుప్రీం కి చెల్లెమ్మ : వివేకా హత్య కేసులో ఏం తేలింది...?

By:  Tupaki Desk   |   12 Aug 2022 8:32 AM GMT
సుప్రీం కి చెల్లెమ్మ : వివేకా హత్య కేసులో ఏం తేలింది...?
X
మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగి ఇప్పటికి మూడున్నర ఏళ్ళు దాటింది. 2019 ఎన్నికల ముందు ఆయన తన ఇంట్లోనే గొడ్డలి పోటుకు గురి అయి మరణించారు. నాడు తొలుత గుండె పోటు అన్నారు. ఆ మీదట అది గొడ్డలి పోటు అయింది.

ఏది ఏమైనా ఆయన మీద గొడ్డలి పోటు పొడిచిన వారు ఎవరో ఈ రోజుకీ తేలకపోవడమే అసలైన దారుణం. ఇక వివేకా అన్న కొడుకైన జగన్ ఏపీకి సీఎం గా ఉన్నారు. అయినా ఈ కేసు అతీ గతీ తేలడంలేదని వివేకా కూతురు, జగన్ చెల్లెలు అయిన సునీత సుప్రీం కోర్టు దాకా వెళ్ళి న్యాయ పోరాటం చేసి మరీ సీబీఐ విచారణ పరిధిలోకి కేసుని తేగలిగారు.

అయినా సరే ఏమీ తేలలేదు,అదే తాత్సారం, అదే నిర్లక్ష్యం. అదే ఉదాశీనత. ఇప్పటికీ ఈ కేసులో మూలాలు ఏవీ ఎవరికీ తెలియవు. వెంట్రుక వాసి కూడా ఆధారాలు లభ్యం కావడంలేదు. మరి తెర వెనక పెద్దలు ఎవరో తెలిస్తేనే ఈ కేసు క్లోజ్ అయ్యేది.

దాంతో విసిగి వేశారిన సునీత ఇపుడు సుప్రీం కోర్టులో మళ్లీ కేసు ఫైల్ చేశారు. సీబీఐ దర్యాప్తు సైతం ఆమెను సంతృప్తి పరచలేని పరిస్థితుల్లో ఈ కేసు ఏకంగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు సాగాలని ఆమె గట్టిగా కోరుకుంటున్నారు.

దాంతో ఆమె సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయడమే కాదు, ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని, సీబీఐని కూడా చేర్చడం విశేషం. ఈ కేసు విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఈ దర్యాప్తు సాగితే సీబీఐలో చురుకుదనం పుడుతుందా. వేగంగా విచారణ సాగి వెనక ఉన్న దోషులు తెర ముందుకు వస్తారా.

ఏది ఏమైనా ఏపీలో రాజ్యమేలుతోంది వైఎస్సార్ ఫ్యామిలీ. బాధితురాలు వైఈసార్ కుటుంబీకురాలే. ఇక హత్య కావించబడిన మనిషి కూడా వైఎస్సార్ కుటుంబీకుడే. అయినా కేసు తెమలడంలేదు అంటే ఏమనుకోవాలి. ఏది ఏమైనా సునీత కేసు విషయం చూస్తే ఇంతటి పలుకుబడి రాజకీయ నేపధ్యం ఉన్న మాజీ మంత్రి వివేకా హత్య కేసు కూడా కొలిక్కి రాకపోతే సామాన్యుల సంగతేంటి అన్న ప్రశ్నలు అయితే కలుగక మానవు. ఇక చెల్లెలు సుప్రీం కోర్టు తలుపుని మరోసారి తట్టడం అంటే అన్న రాజ్యం మీద మరో సారి అసహనం వెళ్లగక్కడమే అనే వారూ ఉన్నారు.