జనసేనకి రేవంత్ బూస్ట్

Thu Sep 12 2019 17:41:07 GMT+0530 (IST)

What Revanth Reddy Said About Pawan Kalyan?

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నుంచి జనసేన అధినేతకు ప్రశంసలు అందాయి. ఇటీవలే యురేనియం ఖనిజ తవ్వకాలపై పవన్ కళ్యాణ్ గొంతెత్తిన విషయం తెలిసిందే. బంగారు తెలంగాణ ను యురేనియం తెలంగాణ చేస్తారా అంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమం ఊపందుకుంటోంది. యురేనిజం తవ్వకాలను నిరసిస్తూ నల్లమల పరిసర గ్రామాల్లో బంద్ పాటించారు. అమ్రాబాద్ - పడారా మండలాల్లో పూర్తిగా బంద్ జరిగింది. కాంగ్రెస్ - లెఫ్ట్ పార్టీలు వారికి మద్దతుగా నిలిచి జేఏసీని కూడా ఏర్పాటుచేశాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీలో దీనిపై చర్చా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో ఒక రెప్యుటేషన్ ఉంది. పవన్ రాజకీయంగా సక్సెస్ కాకపోయి ఉండొచ్చు. కానీ పవన్ ఎత్తుకునే సమస్యల్లో నిజాయితీ ఉంటుందని జనాలకు నమ్మకం ఉంది. సమాజాన్ని సుదీర్ఘంగా పట్టిపీడించే అసలైన సమస్యల పరిష్కారానికి పవన్ మద్దతు ఇస్తారన్న టాక్ ఉందన్నారు. దీనివల్ల వచ్చే రాజకీయ లాభనష్టాలను పవన్ పట్టించుకోరు. జనాలకు ఇబ్బంది కలిగించే అంశాలపై పోరాటం చేయడంలో ఏ రాజకీయ లెక్కలు పవన్ కు ఉండవు అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.

అయితే... యురేనియం పోరాటం ద్వారా కేసీఆర్ పై పైచేయి సాధించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తోంది. రీసెంట్ గా కాంగ్రెస్ నేత హనుమంతరావు కూడా ఇదే ఇష్యూపై పవన్ ని కలిశారు. ఆ తర్వాతే పవన్ ట్వీట్ వేశారు. ఈ నేపథ్యంలో పవన్ ని పొగిడితే కాంగ్రెస్ కు వచ్చే నష్టం ఏమీ లేదు కాబట్టి... తన రాజకీయ పోరాటానికి పవన్ ను కాంగ్రెస్ సద్వినియోగం చేసుకుంటోంది. ఏది ఏమైనా... తమ నాయకుడు నిజాయితీ పరుడు అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు జనసేనకు బూస్ట్ - హార్లిక్స్... అన్నీ !!