బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యతిరేకత.. మోడీకి సెగ ఖాయమేనా?

Sun Sep 12 2021 19:00:37 GMT+0530 (IST)

What Is The Modi strategy

దేశంలో వరుసగా అధికారం దక్కించుకున్న బీజేపీకి ఇప్పుడు.. ఒకింత భయం వెంటాడుతోందనడంలో సం దేహం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికి 2014 2019 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకుని కేంద్రంలో అధికారం చలాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ముచ్చటగా మూడో సారి కూడా పీఎం పీఠం దక్కించుకుని.. కాంగ్రెస్‌కు అడ్రస్‌లేకుండా చేయాలనేది ప్రధాన లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే.. మూడోసారి అధికారంలోకి రావడం అనేది అంత తేలికగా జరిగేలా కనిపించడం లేదని.. బీజేపీ నాయకులు గుర్తిస్తున్నారు.కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక వహిస్తున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పుడు పరిస్థితి తలకిందలవుతోంది. 2019లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భారీ ఎత్తున హవా సాగింది కనుకే.. కేంద్రంలో మోడీ.. అధికారంలోకి వచ్చేందుకు ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇబ్బందులు వస్తున్నాయి. గుజరాత్ యూపీ కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పాలనపై తీవ్ర విమర్శలు రావడంతోపాటు.. గుజరాత్ కర్ణాటకల్లో మంత్రులు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు పెరిగిపోయాయి.

దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకత పెరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హుటాహుటిన.. బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇప్పటికే కర్ణాటకలో ముఖ్యమంత్రి యడియూరప్పను పక్కన పెట్టారు. తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి రూపానీని తప్పించారు. సహజంగా అయితే.. ఈ రెండు రాష్ట్రాలు కూడా బీజేపీకి కంచుకోటలు. ఈ రాష్ట్రాలే.. గత ఎన్నికల్లో ఎంపీ స్థానాలను కూడా ఎక్కువగా అందించాయి. దీంతో మోడీ.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. పీఎం పీఠాన్ని అధిష్టించారు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత.. పరిస్థితి మారిపోయింది. యూపీ సహా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. మరణాలు దాచారనే.. విమర్శలు జోరుగా ఉన్నాయి. అదేసమయంలో కరోనా బాధితులకు సరైన వైద్యం అందించలేక పోయారనే విమర్శలు వున్నాయి. ఈ పరిస్థితిలో సహజంగానే ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఇప్పుడు ఇది వచ్చే ఎన్నికల నాటికి ప్రతిరోధకంగా మారే అవకాశం ఉంటుందని.. కేంద్రం పెద్దలు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి ఈ వ్యతిరేకతను గుర్తించి.. ప్రజలకు మేలు చేసే పనులు చేసి ఉంటే.. వేరేగా ఉండేది. కానీ తమ పీఠం కాపాడుకునేందుకు మాత్రమే.. చర్యలు చేపట్టడం.. వంటివి విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే.. ఒక్కటి మాత్రం వాస్తవం.. తనకు ప్రపంచం మొత్తం దాసోహం చేస్తోందని.. తనను చూసి ప్రపంచం మురిసిపోతోందని పదే పదే చెప్పుకొనే మోడీ.. ఇప్పటికైనా.. పరిస్థితి తనకు వ్యతిరేకంగా మారుతోందని.. ప్రజానాడిలో తేడా కొడుతోందని గుర్తించడం ఒక్కటే ఆసక్తికర అంశంగా ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. కేవలం ముఖ్యమంత్రులను మార్చి ఊరుకుంటారో.. లేక.. తన విధానాలు మార్చుకునేందుకు ప్రయత్నిస్తారో అనేది ఆసక్తిగా మారింది.