జూనియర్ కు వైసీపీలో ఇంత డిమాండా ?

Fri Dec 03 2021 11:04:35 GMT+0530 (IST)

What Is The Demand For Junior In YCP

జూనియర్ ఎన్టీయార్ కు తెలుగుదేశం పార్టీలోనే కాదు అధికార వైసీపీలో కూడా ఫుల్లుగా డిమాండ్ ఉన్నట్లుంది. తెలుగుదేశం పార్టీ నిలబడాలంటే ఎన్టీయార్ కుటుంబ సభ్యులు పార్టీ పగ్గాలు అందుకోవాలని మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి గట్టిగా డిమాండ్ చేయటం గమనార్హం. ఇక్కడ మంత్రి ఉద్దేశ్యం ఏమిటంటే ఎన్టీయార్ కుటుంబ సభ్యులంటే కేవలం జూనియర్ ఎన్టీయార్ మాత్రమే అని అందరూ గ్రహించాలి.ఎందుకంటే ఎన్టీయార్ కుటుంబ సభ్యుల్లోని ఇతరులతో పోల్చుకుంటే పొలిటికల్ గా బాగా యాక్టివ్ గా ఉండేది కేవలం నందమూరి బాలకృష్ణ మాత్రమే. గడచిన రెండు ఎన్నికల్లో బాలకృష్ణ అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుంచి ఎన్నికవుతున్నారు. పదేళ్ళుగా ఎంఎల్ఏగా పనిచేస్తున్నా ఆయన మొదటి ప్రిఫరెన్సు మాత్రమే సినిమాలే అని అందరికీ తెలిసిందే. ఇదే సమయంలో జనాల్లో పార్టీ గ్రాఫ్ పడిపోతున్న నేపధ్యంలో మళ్ళీ పుంజుకోవాలంటే జూనియర్ ఎన్టీయార్ పార్టీలోకి రావాలని టీడీపీ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు పదే పదే బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

పార్టీ నేతల అంతర్గత చర్చల్లో పార్టీలోకి జూనియర్ రావాలంటు చర్చలు జరుగుతున్నాయి. ఆయన అభిమానులు కుప్పంతో పాటు అక్కడక్కడ అవసరమైనపుడల్లా బాగా హడావుడి కూడా చేస్తున్నారు. సరే అదంతా వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అనుకుందాం. మరి వైసీపీ వాళ్ళు కూడా జూనియర్ పేరెత్తకుండా పరోక్షంగా ఎన్టీయార్ కుటుంబ సభ్యులు పార్టీ పగ్గాలు అందుకోవాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నట్లు ?ఎందుకంటే ఎన్టీయార్ అభిమానుల్లో చంద్రబాబు లోకేష్ కు వ్యతిరేకంగా ఒత్తిడి పెంచేయాలన్న ప్లాన్ కనబడుతోంది. ఇప్పటికే జూనియర్ కు చంద్రబాబు+లోకేష్ కు మధ్య బాగా గ్యాప్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. దీన్ని అడ్డంపెట్టుకుని ఎన్టీయార్ కుటుంబానికి మద్దతుగా నిలబడినట్లు మంత్రి కలరింగ్ ఇస్తున్నారు. కానీ ఎన్టీయార్ అభిమానులు మద్దతుదారుల్లో చంద్రబాబు లోకేష్ పై వ్యతిరేకత పెంచటమే టార్గెట్ గా కనబడుతోంది.

నిజానికి తెలుగుదేశం పార్టీకి ఎవరు సారధ్యం వహించాలన్న విషయం వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఇందులో ఇతర పార్టీలకు ఎలాంటి ప్రమేయం ఉండదు. కానీ వైసీపీలోకి కొందరు నేతలు మాత్రం పదే పదే టీడీపీలోకి ఎన్టీయార్ కుటుంబసభ్యులు రావాలనే డిమాండ్ వినిపించటం వెనుక పెద్ద అజెండానే ఉన్నట్లు అర్ధమవుతోంది. ఎన్టీయార్ అభిమానులు మద్దతుదారులను టీడీపీకి దూరం చేయాలని కొందరు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు అనుమానంగా ఉంది. మరి వాళ్ళు ప్లానులో సక్సెస్ అవుతారా ? అది జూనియర్ నిర్ణయం మీదే ఆధారపడుంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.