Begin typing your search above and press return to search.

బెడిసికొట్టిన ఫిరాయింపుల ప్రయోగం

By:  Tupaki Desk   |   4 May 2021 4:30 PM GMT
బెడిసికొట్టిన ఫిరాయింపుల ప్రయోగం
X
ఫిరాయింపుల అస్త్రం పశ్చిమబెంగాల్లో కూడా బెడిసికొట్టింది. మొన్నటి ఎన్నికల్లో ఎలాగైనా తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించి బీజేపీ జెండాను ఎగరేయాలని నరేంద్రమోడి, అమిత్ షా అండ్ కో విశ్వప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఉపయోగం లేకపోయింది. ఎవరు ఊహించని విధంగా తృణమూల్ కాంగ్రెస్ కు ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెట్టారు. ఈ నేపధ్యంలో బీజేపీ ఓటమికి కారణాలను విశ్లేషకులు అన్వేషిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఒక కారణం ఏమిటంటే ఫిరాయింపులను బీజేపీ నెత్తిన పెట్టుకోవటమట. మమతను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ఉద్దేశ్యంతో మోడి, అమిత్ విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. తృణమూల్ నుండి అనేకమంది ఎంపిలు, ఎంఎల్ఏలు, నేతలను బీజేపీలోకి లాగేసుకున్నారు. ముగ్గురు ఎంపిలు, 29 మంది ఎంఎల్ఏలను తృణమూల్ నుండి బీజేపీ లాక్కున్నది.

ఎంఎల్ఏలను లాక్కోవటమే కాకుండా వాళ్ళందరికీ టికెట్లు కూడా ఇచ్చింది. అయితే ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే పోటీచేసే విషయంలో అన్నీ ఏర్పాట్లు చేసుకున్న బీజేపీ నేతలకు దీంతో ఒళ్ళుమండిపోయింది. ఇదే సమయంలో మామూలు జనాలు కూడా ఫిరాయింపులపై మండిపోయారు. ఐదేళ్ళు అధికారపార్టీలో ఉండి చివరినిముషంలో బీజేపీలో చేరి మళ్ళీ మమతపైనే ఆరోపణలు చేయటాన్ని జనాలు హర్షించలేదట.

దీని ఫలితంగా ఏమైందంటే బీజేపీలోకి ఫిరాయించిన 29 మంది ఎంఎల్ఏల్లో సుబేందు అధికారి, ముకుల్ రాయ్ తప్ప మిగిలిన వారంతా ఓడిపోయారు. అంటే ఫిరాయింపులపై జనాల్లో ఏ స్ధాయిలో మంటుందో అర్ధమైపోతోంది. ఇదే విధమైన పద్దతిని ఏపిలో చంద్రబాబునాయుడు కూడా అనుసరించి 2019 ఎన్నికల్లో దెబ్బతిన్న విషయం అందరు చూసిందే. 23 మంది వైసీపీ ఎంఎల్ఏలను లాక్కుని 17 మందికి టికెట్లిస్తే అందులో ఒక్కరు మాత్రమే గెలిచిన విషయం తెలిసిందే.

సో, ఏపిలో చంద్రబాబు ఫెయిలైనట్లుగానే బెంగాల్లో బీజేపీ కూడా ఫెయిలైంది. అంటే బీజేపీ ఓటమికి కనబడుతున్న అనేక కారణాల్లో ఫిరాయింపులు కూడా కీలక అంశమనే చెప్పాలి. నిజానికి ఫిరాయింపులను జనాలు హర్షించరని ఎప్పుడో అర్ధమైపోయింది. ఫిరాయింపు రాజకీయాలకు కాలం కూడా చెల్లింది. అయినా పార్టీలు మాత్రం దాన్నే పట్టుకుని ఇంకా ఊగులాడుతుండటమే విచిత్రం.