Begin typing your search above and press return to search.

66 వేల మందికి సంక్షేమం..కానీ ఓట్లు 61 వేలు మాత్రమే..ఇలా అయితే ఎలా?

By:  Tupaki Desk   |   18 Nov 2020 2:10 PM GMT
66 వేల మందికి సంక్షేమం..కానీ ఓట్లు 61 వేలు మాత్రమే..ఇలా అయితే ఎలా?
X
ఒకప్పుడు మందు సీసాకు.. పచ్చనోటుకు ఓట్లు పడేవి. ఆ రాత్రి ఎవరు ఎక్కువ పంచితే వారిదే విజయంగా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. సంక్షేమ పథకాలు రాసులుగా పోసినా సరే ఓట్లు పడడం లేదని రాజకీయ పార్టీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇందిరాగాంధీ టైం నుంచి ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇవ్వడంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఇప్పటికీ దళితుల ఓట్లు, ఎస్సీ ఓట్లు కాంగ్రెస్ కే పడుతున్నాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇస్తే ఆ పథకం పెద్ద సక్సెస్ అయ్యి తెలుగు దేశం పార్టీ ఓట్ల వాన కురిపించింది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంట్, 108 సర్వీసులు - రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు అన్ని అమలు చేస్తే 2009 ఎన్నికల్లో బోటాబోటా మెజార్టీతోనే గెలిచారు. నాడు ప్రజారాజ్యం - లోక్ సత్తా పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చితే బోటా బోటీ మెజారిటీ వచ్చిందని స్వయంగా వైఎస్ఆర్ నే అసెంబ్లీలో బహిరంగంగా చెప్పారు. ఎన్ని పథకాలు అమలు చేసినా పెద్దగా మెజారిటీ రాలేదు అని వివరించారు.

ఆ తరువాత రాష్ట్రం విడిపోయిన తరువాత కేసీఆర్ - చంద్రబాబు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. కేసీఆర్ ఎన్నికల టైమ్ లో సోషల్ ఇంజినీరింగ్ తోపాటు ఆంధ్రుల పెత్తనం అంటూ టీడీపీ రాజకీయాలను రెచ్చగొట్టి భావోద్వేగంతో ఎలాగోలా గెలిచేశాడు. ఇక ఏపీలో అయితే చంద్రబాబు ఎన్నికలకు వారం ముందు కూడా కోటి మంది మహిళలకు రూ.10వేలు వరకు ఇస్తే ఆయనకు ఓట్లు పడలేదు. జగన్ చేతిలో ఓడిపోయాడు.

ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ దాదాపు 55వేల కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద జగన్ పంచాడు. అయినా కూడా ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ చేసిన పాదయాత్రకు జనాలు రావడం లేదనే టాక్ వచ్చింది. ఇటీవల దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్ దాదాపు 66వేల మందికి సంక్షేమ పథకాలు అందజేస్తే వచ్చిన ఓట్లు కేవలం 61వేలు మాత్రమే కావడం గమనార్హం. దానిలో టీఆర్ఎస్ అభిమానులు - కార్యకర్తల ఓట్లే ఎక్కువగా ఉన్నాయట..

ఈ సమాచారంను బట్టి సంక్షేమ పథకాలకు ఓట్లు రాలవని తేలిపోయింది. కేవలం నాయకత్వం - అభివృద్ధి - భరోసా అనేవి రాబోయే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయని తెలుస్తోంది.. ఇప్పుడు ఎన్నికల్లో సోషల్ మీడియా - ఎలక్ట్రానిక్ మీడియా - సమకాలీన పరిస్థితులపై ఓటర్స్ కు బాగా అవగాహన ఏర్పడిందని.. ‘సీఎం వాళ్ల ఇంట్లోంచి ఇవ్వడం లేదని.. అప్పులు చేసి ఇస్తున్నారని.. మళ్లీ ఆ భారం ప్రజల మీద పడుతుందని.. అంతకంటే ఏమీ లేదు’ ఓటర్లు అధికార పార్టీల డబ్బుల పంపిణీని లైట్ తీసుకుంటున్నారట..

ఇప్పటి ఓటర్లు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ప్రశ్నించేవాళ్లనే కోరుకుంటున్నారని మేధావులు అంటున్నారు. దీంతో ఇప్పటికైనా అధికార పార్టీలు ఈ ఉచితానుచితాలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితేనే గెలుస్తారని.. డబ్బులు పంచితే గెలవరని పార్టీలకు జ్ఞానోదయం కలుగుతోందట.. ఈ లెక్కలన్నీ చూశాక.. వరద సాయం పేరుతో హైదరాబాద్ కు రూ.10వేల పంచుతున్న కేసీఆర్ కు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి గతి పడుతుందనేది వేచిచూడాలి.