Begin typing your search above and press return to search.

ప్రగతి భవనాన్ని కూల్చి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం: బండి సంజయ్

By:  Tupaki Desk   |   30 July 2021 2:40 PM GMT
ప్రగతి భవనాన్ని కూల్చి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం: బండి సంజయ్
X
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఆయన వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.

ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. 2023 తర్వాత లక్ష నాగళ్లతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్ ను బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు.

హుజూరాబాద్ లో జరుగుతోంది ఉప ఎన్నికలకు కావని.. కేసీఆర్ బైయింగ్ ఎలక్షన్స్ అని బండి సంజయ్ అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు కాదని.. రూ.50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

హూజూరాబాద్ లో బీజేపీ గెలుపును సీఎం కేసీఆర్ అడ్డుకోలేరని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై సీఎంకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేయిస్తున్నారని.. ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈటల బావమరిది చాటింగ్ పై విచారణ జరిపించాలని బండి సంజయ్ సవాల్ చేశారు. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ సిద్ధమవుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.