Begin typing your search above and press return to search.

ఆ విషయంలో అమెరికా తర్వాత మనమే ఉన్నామట

By:  Tupaki Desk   |   20 Oct 2020 10:10 AM GMT
ఆ విషయంలో అమెరికా తర్వాత మనమే ఉన్నామట
X
కరోనా కారణంగా మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని రీతిలో యావత్ ప్రపంచం స్తంభించిపోవటమే కాదు.. జీవన శైలిలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ గమనంలో కరోనాకు ముందు కరోనా తర్వాత అన్న విభజన స్ఫష్టం కానుంది. ఈ మహమ్మారి కారణంగా ఈ విద్యా సంవత్సరం మొత్తం ఆన్ లైన్లో నే గడవనుంది. అందుకు భిన్నంగా కొన్ని దేశాల్లో స్కూళ్లు.. కాలేజీలు తెరవటం.. దీంతో వైరస్ వ్యాప్తి పెద్ద ఎత్తున చోటు చేసుకోవటం తెలిసిందే.

ఇందుకు భిన్నంగా అమెరికాతో పాటు.. భారత్ లోనూ ఎక్కువగా ఆన్ లైన్ క్లాసుల మీదనే ఫోకస్ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సాగుతున్న ఆన్ లైన్ విద్యకు సంబంధించి కోర్సెరా 2020 తాజా నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. ఆన్ లైన్ కోర్సులకు భారీగా డిమాండ్ పెరుగుతున్న వైనాన్ని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ కోర్సుల్నిఅందించటంలో కోర్సెరాకు మంచి పేరు ఉంది. ఈ సంస్థ చేసిన అధ్యయనంలో కొత్త విషయాలు వెల్లడయ్యాయి.

దీని ప్రకారం అమెరికా తర్వాత ఆన్ లైన్ కోర్సుల్ని నేర్చుకుంటున్న వారు భారత్ లోనే ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. ఇటీవల కాలంలో ఆన్ లైన్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్టార్టప్ లు భారత్ లో బాగా పెరుగుతున్నట్లు చెప్పింది. ప్రస్తుతం భారత్ లో 4500 వరకు ఆన్ లైన్ ఎడ్యుటెక్ కంపెనీలు పుట్టుకొచ్చినట్లుగా చెప్పింది. దేశాల వారీగా ఆన్ లైన్ కోర్సుల్ని నేర్చుకుంటున్న వారి వివరాల్ని వెల్లడించింది.

ఇందులో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో 1.4కోట్ల మంది ఆన్ లైన్ లో కోర్సులు నేర్చుకుంటున్నారు. తర్వాతి స్థానం భారత్ దే. మన దగ్గర 98 లక్షల మంది ఆన్ లైన్ కోర్సులు చేస్తున్నారు. తర్వాతి స్థానాల సంగతి చూస్తే.. మెక్సికో (38 లక్షలు).. చైనా (35 లక్షలు).. బ్రెజిల్ (30లక్షలు) లో నేర్చుకున్నట్లుగా ఈ నివేదిక వెల్లడించింది. ఇక.. ఆన్ లైన్ లో ఎక్కువగా కోర్సులు చేస్తున్న వారిలో.. వేటి మీద ఫోకస్ పెట్టారన్న విషయానికి వెళితే.. కెరీర్ కోసం కాంటాక్టు ట్రేసింగ్.. డిజిటల్ మార్కెటింగ్.. ప్రాజెక్టు మేనేజ్ మెంట్.. ఫైథాన్ ప్రోగ్రామింగ్.. సోషల్ సైకాలజీ.. జావా స్క్రిప్టు.. అల్గారిథమ్స్.. గ్రాఫిక్ డిజైన్.. రిగ్రెషన్ అనాలసిస్.. డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నట్లుగా తేల్చారు.

విద్యార్థులు నేర్చుకుంటున్న కోర్సుల విషయానికి వస్తే.. ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్ వర్క్స్.. డిజిటల్ మార్కెటింగ్.. బ్లాక్ చైన్ టెక్నాలజీ.. పైథాన్ ప్రోగ్రామింగ్..జావా స్క్రిప్టు.. బయోఇన్ ఫర్మేటిక్స్.. అల్గారిథమ్స్.. గ్రాఫిక్ డిజైన్ తదితర కోర్సులు చేస్తున్నట్లు పేర్కొన్నారు.