Begin typing your search above and press return to search.

'వి విల్‌ బ్రింగ్‌ ఇట్‌ హోమ్‌' వాట్సాప్ గ్రూపు.. భారత్ ను చరిత్రలో మెరిసేలా చేసింది

By:  Tupaki Desk   |   16 May 2022 4:04 AM GMT
వి విల్‌ బ్రింగ్‌ ఇట్‌ హోమ్‌ వాట్సాప్ గ్రూపు.. భారత్ ను చరిత్రలో మెరిసేలా చేసింది
X
భారత క్రీడా ప్రపంచం మొత్తం మురిసిపోతున్న థామస్ కప్ విజయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ జట్టు.. ఇంతటి అపూర్వమైన విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న విషయాన్ని ఏ ఒక్కరూ అంచనా వేయలేకపోయారు. తాజాగా విజయం వెనుక జట్టు సభ్యుల నిరంతర శ్రమ.. కోచ్ ల శిక్షణతో పాటు.. ఒక వాట్సాప్ గ్రూపు కీ రోల్ ప్లే చేసిందని చెప్పాలి.

తమను ఎవరూ నమ్మని వేళలో ఆటగాళ్లు.. తమను తాము నమ్ముకున్నారు. వారి నమ్మకానికి కోచ్ లు అండగా నిలిచారు. జట్టులో స్ఫూర్తికి ఏ మాత్రం డోకా లేని రీతిలో టోర్నీ ఆరంభం ముందు నుంచే భారత టీం 'వి విల్‌ బ్రింగ్‌ ఇట్‌ హోమ్‌' పేరిట ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసింది. అందులో నిరంతరం స్పూర్తిని నింపే సందేశాలతో పాటు.. విజయాన్ని సాధించేందుకు అవసరమైన అంశాలను చర్చించేవారు.

టోర్నీకి వచ్చిన సందర్భంలో జట్టు లక్ష్యం కనీసం సెమీస్ కు చేరటం.. కాంస్యాన్ని ఖాయం చేసుకోవటమే. కానీ.. క్రీడాకారులు అనూహ్యంగా రాణించి.. అందరి అంచనాలకు భిన్నంగా.. ఎవరూ ఊహించని రీతిలో స్వర్ణాన్ని సొంతం చేసుకోవటం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ గెలుపులో వాట్సాప్ గ్రూపు కూడా కీలక భూమిక పోషించిందన్న మాట వినిపిస్తోంది. అపూర్వమైన విజయాన్ని సాధించిన వేళ.. జరిగిన సీన్ గురించి తెలిస్తే.. ఈ విజయం ఎంత అపురూపమైదన్నది ఇట్టే అర్థమవుతుంది.

స్వర్ణాన్ని సొంతం చేసుకోవటానికి కొద్ది క్షణాల ముందు.. కిడాంబి శ్రీకాంత్‌ అలా గాల్లోకి ఎగిరాడు... తనదైన శైలిలో ఒక క్రాస్‌కోర్ట్‌ స్మాష్‌ను సంధించాడు. ప్రత్యర్థి క్రిస్టీ స్పందించలేకపోయాడు. అంతే! శ్రీకాంత్‌ వెనుదిరిగి రాకెట్‌ విసిరేయగా, భారత ఆటగాళ్లంతా ఒక్కసారిగా ప్రవాహంలా కోర్టులోకి దూసుకొచ్చారు. సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత.. ఎంతటి అపూర్వమైన విజయం అయినప్పటికీ.. ప్రత్యర్తికి మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వటం కనిపిస్తుంది.

తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అపూర్వమైన విజయాన్ని సాధించిన సంతోష సమయంలో తన ప్రత్యర్థి క్రిస్టీకి మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేకపోయారు. దీనికి కారణం.. ప్రవాహంలా దూసుకొచ్చిన షట్లర్ల సంబరాలతో స్టేడియం హోరెత్తింది. అరుదైన విజయాల్ని సొంతం చేసుకున్నప్పుడు ఇలాంటి జరుగుతుంటాయి మరి.