మొదలైన అనర్హత వార్

Fri Jun 18 2021 21:00:02 GMT+0530 (IST)

War of Disqualification In West Bengal

పశ్చిమబెంగాల్లో మమత బెనర్జీ-బీజేపీ మధ్య అనర్హత వార్ మొదలైంది. బీజేపీ ఎంఎల్ఏ ముకుల్ రాయ్ కేంద్రంగా తాజాగా ఇరు వైపులా వివాదాలు మొదలుకావటం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో  బీజేపీ తరపున కృష్ణానగర్ ఉత్తర నియోజకవర్గం నుండి ముకుల్ రాయ్ గెలిచారు. అయితే ఈమధ్యే బీజేపీను వదిలేసి తృణమూల్ పార్టీలో చేరిపోయారు. దాంతో బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి అనర్హత వేటు విషయాన్ని ప్రస్తావించారు.తమ పార్టీ తరపున గెలిచి తృణమూల్లో చేరిన ముకుల్ వెంటనే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలని సువేందు డిమాండ్ చేశారు. ఒకవేళ ముకుల్ రాజీనామా చేయకపోతే అనర్హత వేటు వేయిస్తామంటు హెచ్చరించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే సువేందు ముకుల్ తదితరులంతా తృణమూల్లోని కీలక నేతలుగా ఉండేవారు. తర్వాత మమతతో విభేదించి బీజేపీలో చేరిపోయారు.

తృణమూల్ తరపున గెలిచి బీజేపీలోకి దూకూసినపుడు వీళ్ళెవరికీ తమ పదవులకు రాజీనామాలు చేయాలని అప్పట్లో అనిపించలేదు. ఎన్నికలకు ముందు సువేందు అధికారి తండ్రి సోదరుడు తృణమూల్ నుండి బీజేపీలోకి దూకారు. అప్పుడు తమ పదవులకు వాళ్ళు రాజీనామాలు చేయలేదు. అయితే ఇపుడు బీజేపీలో నుండి తిరిగి కొందరు ఎంఎల్ఏలు తృణమూల్లోకి వెళుతుంటే సువేందు తట్టుకోలేక రాజీనామాలని అనర్హత వేటని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

ఇదే విషయమై తృణమూల్ నేతలు సువేందుపై ఎదురుదాడి చేస్తున్నారు. తృణమూల్లో నుండి బీజేపీలోకి వెళ్ళినపుడు సువేందు కానీ ఆయన తండ్రి కానీ ఎందుకని రాజీనామాలు చేయలేదని నిలదీశారు. తృణమూల్లో నుండి బీజేపీలోకి వెళినపుడు తమ కుటుంబం ఏమిచేసిందో గుర్తుంచుకోవాలని చురకలంటించారు. మొత్తంమీద ముకుల్ రాయ్ తృణమూల్లోకి వెళ్ళటాన్ని బీజేపీ తట్టుకోలేకపోతోంది.

అలాగే ఇంకా కొందరు ఎంఎల్ఏలు బీజేపీకి దూరమైపోతారనే ప్రచారాన్ని కమలనాదుల్లో టెన్షన్ మొదలైపోయింది. ఫిరాయింపులను అడ్డుకునేందుకే అనర్హతవేటు పేరుతో బెదిరింపులకు దిగినట్లు అర్ధమైపోతోంది. ఎంతమందిని బెదిరించగలరనేది చూడాలి.