Begin typing your search above and press return to search.

ట్రంప్ కు మసిపూసి మారేడుకాయ చూపించబోతున్నారు..

By:  Tupaki Desk   |   19 Feb 2020 5:30 PM GMT
ట్రంప్ కు మసిపూసి మారేడుకాయ చూపించబోతున్నారు..
X
అగ్రరాజ్యంగా పేరుపొందిన అమెరికా భారతదేశంతో సత్సంబంధాలకు ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో భారత్ ఫస్ట్ అనే వైఖరి అవలంభిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో మార్కెట్ ఎక్కువ, జనాభా ఎక్కువ, భారత్ లో అపార అవకాశాలు, వనరులు ఉండడంతో అమెరికా దృష్టి ఎప్పుడు భారత్ పైనే ఉంటుంది. అందుకే భారతదేశానికి విశేష ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం డొనల్డ్ ట్రంప్ తన అధికారిక నివాసంలో శ్వేతసౌధం (వైట్ హౌస్) లో తొలి ఆతిథ్యం మన భారత ప్రధానికే దక్కింది. ఆ తర్వాత కొన్ని నెలల కిందట అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ట్రంప్ కూడా పాల్గొని సందడి చేశారు. ఆ సమయంలోనే భారత్ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీ చేసిన వినతిని మన్నించి ఇప్పుడు భారత పర్యటనకు ట్రంప్ దంపతులు వస్తున్నారు. వీరి పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశేష ప్రాధాన్యం కల్పిస్తున్నారు.

ఆయన స్వరాష్ట్రం గుజరాత్ లో ట్రంప్ పర్యటించేలా షెడ్యూల్ నిర్ణయించారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ దంపతులు గుజరాత్ లోని అహ్మదాబాద్‌ లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వీరి పర్యటనకు హంగుఆర్బాటాలు మామూలుగా చేయడం లేదు. ఒక రాజకీయ నాయకుడి సభకు చేసినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం హడావుడిగా పనులు కొనసాగుతున్నాయి. ఈ పర్యటన మీద ట్రంప్‌ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రోడ్లకు ఇరువైపులా 70, 80 లక్షల మంది బారులు తీరి మీకు స్వాగతం చెప్పబోతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన చెవిలో చెప్పిన మాటను ట్రంప్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం తాను పర్యటిస్తుండడం తో మీరు చెప్పిన లెక్క ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలని పరోక్షంగా తెలిపినట్లు సమాచారం.

అయితే ఇప్పటికే ఏర్పాట్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా మురికివాడలను కనిపించకుండా గోడ కట్టడం, మురికివాడలను ఖాళీ చేయించడం తదితర పనులు ప్రజల్లో ఆగ్రహం తెప్పిస్తుండగా.. ఇప్పుడు ట్రంప్ దంపతులను స్వాగతం పలకడానికి 70, 80 లక్షల మంది స్వాగతం పలికించాలనే నిర్ణయం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతమంది ఎందుకు.. ట్రంప్ కు అలాంటి స్వాగతం పలకాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ఏమైనా రాజకీయ నాయకుడా? లేదా ప్రజలందరిని చూడడానికి ఆయన వస్తున్నారా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పర్యటనకు ప్రజలను బలి చేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. భారత్ లో సమస్యలు తెలియకుండా ట్రంప్ దంపతులకు మసిపూసి మారేడుకాయ చూపిస్తున్నారని మండిపడుతున్నారు. ట్రంప్ జీ ఇదర దేఖో అని పలు సమస్యలను ప్రతిపక్ష నాయకులు లేవనెత్తుతున్నారు.