Begin typing your search above and press return to search.

అమెరికాకి చురకలు అంటించిన డబ్ల్యూహెచ్ ఓ..ఏమైందంటే!

By:  Tupaki Desk   |   9 April 2020 4:00 PM GMT
అమెరికాకి చురకలు అంటించిన డబ్ల్యూహెచ్ ఓ..ఏమైందంటే!
X
కరోనావైరస్ తో ప్రస్తుతం ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అయితే కరోనా దెబ్బకి అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే అమెరికాలో 4 లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికా లో 95 శాతం మంది ప్రజలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే, కరోనా బారిన పడుతున్న ప్రజలు రోజు రోజుకు ఎక్కువౌతున్న తరుణంలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒక్కోసారి తనను తాను మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.

ప్రపంచ ఆరోగ్యసంస్థపై ఇప్పటికే అనేకమార్లు ఆరోపణలు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా తో కుమ్మక్కైందని ఆరోపణలు చేసారు. వైరస్ వెలుగు చూసిన తొలినాళ్ల లో దాని తీవ్రత గురించి డబ్ల్యూహెచ్ ఓ వద్ద సమాచారం ఉన్నా పంచుకోవడానికి ఇష్టపడ లేదని కరోనా విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్నో తప్పటడుగులు వేసిందని విమర్శలు గుప్పించారు. అలాగే ఆ సంస్థకు నిధులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు.

దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ స్పందించారు. వైరస్ చైనా లో మొదట వెలుగులోకి రాగానే .. జనవరి నుంచి ప్రపంచ దేశాలను హెచ్చరిస్తున్నామని, అమెరికా లాంటి దేశాలు అసలు ఆ విషయాన్ని పూర్తిగా పట్టించుకోలేదని అన్నారు. ఇది రాజకీయాలు చేయడానికి తగిన సమయం కాదని - జాతీయ ప్రజలను - ప్రపంచంలో మనిషి మనుగడను కాపాడుకోవలసిన సమయం అని అన్నారు. తాము ఏదేశాన్ని వెనకేసుకొని రావడం లేదని ప్రతి ఒక్కరు తమకు సమానమే అని చెప్పాడు. అన్ని దేశాలు కూడా కలిసి నడిస్తే - ఈ మహమ్మారిని ఎదుర్కోగలం అని అయన చెప్పారు. అలాగే ప్రపంచంతో పాటు కలిసి నడవని ఏ దేశమైన కూడా కష్టాల్లో పడాల్సిందే అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఐరాస మద్దతు పలికింది.