Begin typing your search above and press return to search.

వ‌లంట‌ర్ నిర్వాకం.. వీఆర్వో సంత‌కం ఫోర్జ‌రీ

By:  Tupaki Desk   |   12 July 2020 12:10 PM GMT
వ‌లంట‌ర్ నిర్వాకం.. వీఆర్వో సంత‌కం ఫోర్జ‌రీ
X
సంక్షేమ‌.. అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు చేరువ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఏపీలో వలంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చారు. ఎంతో స‌దుద్దేశంతో తీసుకొచ్చిన ఈ వ్య‌వ‌స్థ‌లో కొద్దిమంది వ‌ల‌న తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తోంది. వ‌లంటీర్లు వక్రబుద్ధి చూపుతూ... ల‌బ్ధిదారుల‌ను వేధించ‌డం.. అవినీతికి పాల్పడ‌డం వంటివి చేస్తున్నారు. అలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ వ‌లంటీర్ ఏకంగా వీఆర్వో సంత‌కం ఫోర్జ‌రీ చేసి డ‌బ్బులు దండుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఇప్పుడు పోలీసుల అదుపులో అత‌డు ఉన్నాడు. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లా కోట మండలం కేశవరం సచివాలయ పరిధిలో చోటు చేసుకుంది.

అక్క‌డి వ‌లంటీర్ వీఆర్వో సంతకాలను ధ్రువపత్రాలపై ఫోర్జరీ చేస్తున్నాడు. ఆ సంత‌కం ద్వారా దరఖాస్తుదారులు నుంచి భారీగా డ‌బ్బులు తీసుకుంటున్నాడు. కొద్ది రోజులుగా ఇలా అవినీతికి పాల్ప‌డుతున్నాడు. ధ్రువపత్రాల కోసం వెళ్లే ప్రజలకు తాను వీఆర్వో సంతకాలు చేయించి ఇస్తానని వారి దగ్గర నుంచి ద‌ర‌ఖాస్తులు తీసుకుని ఆ తర్వాత అతడే వీఆర్వో సంతకం చేసి వారికి ఇస్తున్నాడు. వాటిని ఆన్‌లైన్‌ చేయించి ధ్రువపత్రాలు కూడా తయారు చేయిస్తున్నాడు. ఈ విషయం ఆ వీఆర్వో కరుణాకర్ కు తెలిసింది. తన సంతకాలు ఫోర్జరీ అవుతున్నాయ‌ని తహసీల్దార్ రమాదేవికి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.