Begin typing your search above and press return to search.

దొంగలు బాబోయ్ దొంగలు : ఉక్కు లాంటి టౌన్ షిప్ లో కత్తులు...తుపాకులూ...?

By:  Tupaki Desk   |   26 May 2022 2:30 AM GMT
దొంగలు బాబోయ్ దొంగలు : ఉక్కు లాంటి టౌన్ షిప్ లో కత్తులు...తుపాకులూ...?
X
ఉక్కు కర్మాగారం విశాఖకు గర్వకారణం. అలాంటి ఉక్కు కర్మాగారంలో పనిచేసే అధికారులు ఉద్యోగుల కోసం మూడు వేల ఎకరాలలో సువిశాలంగా నిర్మించిన టౌన్ షిప్ అది. అటు అధునికత, ఇటు పచ్చతనం పరిమళించే ప్రశాంతత సంతరించుకుని కొలువుంటే టౌన్ షిప్ ఇపుడు దొంగలు బాబోయ్ దొంగలు అంటోంది.

అక్కడ అంతా అధికారులు, ఉద్యోగులు ఉంటారు. వారి కోసం ఏకంగా 9450 క్వార్టర్లు వివిధ కేటగిరీలలో నిర్మించారు. అంతా ఒక్కటిగా హాయిగా ఉంటూ అందమైన ఆ టౌన్ షిప్ లో ధీగా గడుపుతున్నారు. అక్కడ వివిధ సెక్టార్ల మధ్యన జీవించే ఉద్యోగులు అంతా అన్నదమ్ములుగా ఉంటారు. పగలైనా రేయి అయినా ఇప్పటిదాకా ఎలా భయమూ బెంగా లేదు.

కానీ ఈ మధ్య అక్కడ కూడా కలికాలం ప్రవేశించింది. ఆకలికాలంలో అర గజానికో దొంగ అన్నట్లుగా సీన్ తయారైంది. అలాంటి దొంగలకు ఆటపట్టుగా స్టీల్ ప్లాంట్ టౌన్ షిప్ ఇపుడు ఉంది అంటున్నారు. ఇక్కడ దొంగలు చిత్రమైన వారు. వారు ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో తుపాకీ పట్టుకుని బెదిరించి సొత్తు దోచుకుంటున్నారు.

ఇలా ఈ మధ్యనే వరసబెట్టి దొంగతనాలు పెద్ద ఎత్తున జరగడంటో టౌన్ షిప్ మొత్తం కలవరంతో కంగారుపడిపోతోంది. లేటెస్ట్ గా ఒక మహిళ సాయంత్రం ఆలయానికి వెళ్ళి తన క్వార్టర్స్ కి వెళ్తూండంగా అనుసరించి ఆమెను బెదిరించాడొక దొంగ. ఆమె మెడ మీద కత్తి పెట్టి మొత్తం బంగారం ఆభరణాలను దోచుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు పెట్టేసరికి అక్కడే వాకింగ్ చేస్తున్న స్టీల్ ప్లాంట్ అధికారి మనోహర్ ఆ దొంగను పట్టుకున్నాడు.

అంతే ఆ దొంగ మనోహరి మీద కత్తితో దాడి చేశాడు. అయితే ఆ గడబిడ చూసి స్థానికంగా ఉన్న వారు అంతా అక్కడికి చేరడంతో దొంగ దొరికాడు. సొత్తూ దొరికింది. ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక్కడ చిత్రమేంటి అంటే ఈ ఉక్కు దొంగ వద్ద ఉన్న కత్తి ఒరిజినల్, తుపాకీ మాత్రం డమ్మీ.

ఇలాంటి దొంగలు కొందరు టౌన్ షిప్ లో చేరి సెక్టార్ కి ఒకరు వంతున పంచుకుని మరీ దొంగతనాలు చేస్తున్నారు. పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం వారి నేరాలకు ఇపుడు అనువుగా మారింది అంటున్నారు. దాంతోనే వరసబెట్టి దొంగతనాలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇక్కడ విశేషం ఏంటి అంటే ఈ టౌన్ షిప్ కి పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ కాపలా ఉంటారు. అదే విధంగా పోలీసులు కూడా నిఘా పెడతారు. మరి ఇంతమంది ఉన్నా దొంగలు ఎలా వస్తున్నారు అంటే జవాబు సింపుల్. మన నిఘా వ్యవస్థ వెరీ పూర్ అని. అందుకే మే నెల 23న సాయంత్రం మహిళ మీద దొంగ దాడి చేశాడు. అంతకు ముందు కూడా సెక్టార్ 5లో కూడా ఇదే తీరున దొంగతనాలు జరిగాయి.

మొత్తానికి ఉక్కు లాంటి టౌన్ షిప్ కూడా మాకు లెక్క లేదు అని చిల్లర దొంగలు, ముసుగు దొంగలు రెచ్చిపోతూంటే విశాఖపట్నమే షాక్ అవుతోంది. రోజురోజుకీ నేరగాళ్ళు పెరిగి పెచ్చరిల్లుతూంటే పోలీసుల వైఫల్యం, నిఘాలో కొట్టొచ్చినట్లుగా కనబడుతున్న నీరసత్వం కూడా జనాలకు శాపాలు అవుతున్నాయి. దొంగలకు అవే అవకాశాలుగా మారుతున్నాయి. ఏది ఏమైనా దొంగలు బాబోయ్ దొంగలు అని విశాఖ అంతా ఇపుడు షేక్ అవుతున్న సీనే కనిపిస్తోంది మరి.